ఇప్పుడు కావాల్సింది కోమ‌టిరెడ్డి..డీకేలే..!

Update: 2015-12-30 11:25 GMT
గంపెడు ఆశ‌ల‌తో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో చాలానే ఆశ‌లు పెట్టుకుంది. తాము తీసుకున్న‌నిర్ణ‌యంతో ఏపీ మొత్తం ఎత్తి పోతుంద‌న్న విష‌యం మీద అవ‌గాహ‌న ఉన్నా.. ద‌శాబ్దాల త‌ర‌బ‌డి న‌లుగుతున్న డిమాండ్‌ ను తీర్చిన త‌మ‌కు అధికారాన్ని క‌ట్ట‌బెట్ట‌టం ఖాయ‌మ‌ని కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం ఆశించింది. దీనికి త‌గ్గ‌ట్లే తెలంగాణ నేత‌లంతా చాలానే మాట‌లు చెప్పారు. క‌మ్మ‌టి క‌ల‌ల్ని చూపించారు. దీంతో.. వారి మాట‌ల్ని న‌మ్మిన కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కత్వం.. చివ‌ర‌కు టీఆర్ ఎస్‌ ను త‌మ‌లో క‌లిపేసుకోవాల‌న్న ఆలోచ‌న‌ను మ‌ర్చిపోయారు.

అయితే.. అనుకున్న ఆంచ‌నాలు పూర్తిగా దెబ్బ తిన‌ట‌మే కాదు.. కేసీఆర్ శ‌క్తియుక్తుల్ని త‌క్కువ‌గా అంచ‌నా వేసి దానికి ఆ పార్టీ భారీగా మూల్యం చెల్లించుకుంది. విజ‌యంలో ఉన్న‌ప్పుడు మాంచి హుషారు మీదున్న కాంగ్రెస్ నాయ‌కులు.. ఊహించ‌ని విధంగా త‌గిలిన ఓట‌మికి బిత్త‌ర‌పోయారు. వారు ఆ షాక్ నుంచి తేరుకునే లోపే.. కాంగ్రెస్‌ ను క‌కావిక‌లం చేసేలా టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ అస్త్రాన్ని ప్ర‌యోగించ‌టంతో నోట మాట రాని ప‌రిస్థితి.

ఇలా.. దెబ్బ మీద దెబ్బ అన్న‌ట్లుగా కాంగ్రెస్ మీద ప‌డేకొద్దీ ఆ పార్టీ నేత‌లంతా కారు ఎక్క‌టానికి క్యూ క‌డుతున్న ప‌రిస్థితి. చివ‌ర‌కు ప‌రిస్థితి ఎంత ద‌య‌నీయంగా మారిందంటే.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ప‌లు జిల్లాల్లో పార్టీ అభ్య‌ర్థుల్ని కూడా బ‌రిలోకి దించ‌లేని దుస్థితి. ఇలాంటి స‌మ‌యంలో త‌మ‌కు బ‌లం ఉన్న న‌ల్గొండ‌.. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో అయినా పట్టు నిలుపుకోవాల‌న్న ప్ర‌య‌త్నాలు చేప‌ట్టింది. అయితే.. ఈ రెండు జిల్లాల్లో ఇరువురు క‌రుడుగ‌ట్టిన కాంగ్రెస్ నేత‌లు ఉండ‌టం.. ఎంత‌కూ లొంగ‌ని వారు.. టీఆర్ ఎస్ కు షాకిచ్చేందుకు త‌మ శాయ‌శ‌క్తులా కృషి చేయ‌టంతో కారు స్పీడ్‌ కు బ్రేకులు వేయ‌గ‌లిగారు. తాజా ఎన్నిక‌ల్లో ఒక్క‌స్థానంలో కాంగ్రెస్ గెలుస్తే గొప్ప అనుకుంటే.. రెండు స్థానాల్లో గెలిచి.. పెద్ద పండ‌గ‌గా మారింది. ఒక‌విధంగా చెప్పాలంటే కాంగ్రెస్‌ కు న్యూఇయ‌ర్ వేడుక‌లు 48 గంట‌ల ముందే మొద‌లైన‌ట్లు చెప్ప‌క త‌ప్ప‌దు.

మొండిత‌నం.. ప్ర‌త్య‌ర్థి మీద పోరాడేందుకు ఎంత‌కైనావెళ్లాల‌న‌న్న ప‌ట్టుద‌ల ఈ ఇద్ద‌రు నేత‌ల‌కు ఎక్కువ‌. ఇదే.. తాజా గెలుపున‌కు ఫ‌లితంగా చెప్ప‌క త‌ప్ప‌దు.

ఓప‌క్క పార్టీ ఫిరాయింపులు.. మ‌రోవైపు ఉప ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌ములతో నిరాశ‌.. నిస్పృహ‌ల‌తో కూరుకుపోయిన కాంగ్రెస్ నేత‌ల‌కు ఏం అవ‌స‌ర‌మ‌న్న విష‌యాన్ని కోమ‌టిరెడ్డి.. డీకేలు త‌మ చేత‌ల్లో చేసి చూపించారు. గెలుపోట‌ములు రాజ‌కీయాల్లో చాలా మామూల‌ని.. అంత దానికే బెదిరిపోకూడ‌ద‌న్న నిజాన్ని వారు గుర్తుకు తెచ్చేలా చేశారు. ప‌గ‌లు త‌ర్వాత చీక‌టి ఎంత మామూలే.. గెలుపు త‌ర్వాత ఓట‌మి కూడా అంతే స‌హ‌జ‌మ‌న్న విష‌యాన్ని అర్థ‌మ‌య్యేలా చేశార‌న‌టంలో సందేహం లేదు. ఒక కోమ‌టిరెడ్డి.. మ‌రో డీకేల త‌త్వాన్ని కాంగ్రెస్ నేత‌లు వంట‌బ‌ట్టించుకుంటే తెలంగాణ‌లో వారికి పూర్వ‌వైభ‌వం అసాధ్య‌మేమీ కాద‌ని చెప్పొచ్చు.
Tags:    

Similar News