కాంగ్రెస్, బీజేపీల‌కు కేటీఆర్ స‌వాల్‌- సౌత్‌ లో 10 గెల‌వండి చూద్దాం

Update: 2019-03-31 06:15 GMT
ఈ దేశంలో జాతీయ పార్టీల‌కు కాలం చెల్లింద‌ని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 71 సంవ‌త్స‌రాలు ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ బీజేపీలు జాతీయ పార్టీలు కావ‌డం వ‌ల్ల ఏం సాధించాయ‌ని కేటీ రామారావు ప్ర‌శ్నించారు. దేశాన్ని మారుస్తాన‌ని వ‌చ్చిన ప్ర‌ధాని మోడీకి కేసీఆర్ రైతు బంధు ప్ర‌వేశ‌పెడితే గాని రైతులకు ఎలా సాయం చేయాలో ఆలోచ‌న త‌ట్టలేదు. చివ‌ర‌కు ఏపీ సీఎం కూడా మ‌న ప‌థ‌కాన్నే కాపీ కొట్టారు.

ఐదేళ్లు ఏం చేశారు మోడీ... చౌకీదార్ అంటున్నాడు. దేనికి కాపలాదారు అంటున్నాడు. ఈ ఐదేండ్ల కాలంలో మోదీ ఒక్క మంచి పని కూడా చేయలేదు. ఇంకొకాయ‌న‌ మా ముత్తాత ఈ దేశాన్ని నడిపిండు. మా నాయనమ్మ ఈ దేశాన్ని నడిపింది. మా నాయన ఈ దేశాన్ని ఏలిండు. కాబట్టి ఈ దేశానికి నేనే టేకేదార్ అంటారు అని రాహుల్ గాంధీపై కామెంట్స్ చేశారు కేటీఆర్‌. ఈ దేశం చౌకీదార్‌, టేకీదార్ వ‌ల్ల ఏం సాధించ‌దు... ఒక జోర్దార్‌, ఒక ధమ్‌ దార్‌, ఒక ఇమామ్‌ దార్ ఈ దేశానికి కావాలి. ఆ పాత్ర పోషించ‌గ‌లిగేది కేవ‌లం కేసీఆర్ మాత్ర‌మే అని కేటీఆర్  అన్నారు.

ప్ర‌జ‌లు మారిపోయారు. బీజేపీకి 150 సీట్లకు మించి రావు. కాంగ్రెస్‌ కు 100 సీట్లు దాట‌వు.  కాంగ్రెస్‌, బీజేపీలంటే చాలా పార్టీల‌కు ఇష్టం లేదు. తృణమూల్‌ కాంగ్రెస్‌, బీఎస్పీ, ఎస్పీ, వైసీపీతో పాటు చాలా పార్టీలు మనకు అనుకూలం. ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే... దక్షిణాదిలో 6 రాష్ర్టాల్లో 130 లోక్‌ సభ స్థానాలున్నాయి. అవి గెలిస్తే చాలు దేశం మ‌న చేతిలో ఉంటుంది. ద‌క్షిణాదిని ఏకం చేయగ‌లిగిన నేత కేసీఆరే. ఉత్త‌రాదిని క‌లుపుకోలిగిన నేత కూడా కేసీఆర్‌. రాబోయే ప్ర‌భుత్వంలో కాంగ్రెస్‌, బీజేపీ ఉండ‌వు. ప్రాంతీయ పార్టీలే ఫెడ‌రల్ ఫ్రంట్‌ గా అధికారంలోకి వ‌స్తాయ‌ని కేటీఆర్ జోస్యం చెప్పారు.

తెలంగాణ ప్ర‌జ‌లు ఇపుడు మేల్కోవాలి. 16 ఎంపీ సీట్లు మ‌నం గెలిస్తే... మ‌నం ఢిల్లీ మాట విన‌క్క‌ర్లేదు. మ‌న‌మాటే ఢిల్లీ ఉంటుంది. హైదరాబాద్‌ కు బుల్లెట్‌ రైలు వస్తుంది. కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతలకు 95 శాతం నిధులు వస్తాయి. కేంద్రం మ‌న చేతిలో ఉంటే ఇవ‌న్నీ సాధ్యం. కేంద్రం మ‌నం చేతిలో ఉండాలంటే... టీఆర్ ఎస్ 16 సీట్లు గెల‌వాలి.  ఒక స‌వాల్ విసురుతున్నా... ద‌క్షిణ భార‌తంలో ఈసారి ఏ జాతీయ‌ పార్టీకి 10 సీట్లు రావు. పట్టుమని పది సీట్లు కూడా గెలవలేని పార్టీలు జాతీయ పార్టీలు ఎట్ల అవుతాయి? సిగ్గుప‌డాలి బీజేపీ కాంగ్రెస్ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
    
    
    

Tags:    

Similar News