బాబు ఢిల్లీ చ‌క్రం కాదు.. విజ‌య‌వాడ‌లో బొంగ‌రం కూడా తిప్ప‌లేరు

Update: 2019-03-04 12:32 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై తెలంగాణ రాష్ట్ర యువ‌నేత‌, పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త‌న కామెంట్ల ప‌రంప‌ర‌ను కొన‌సాగిస్తున్నారు. మీడియా స‌మావేశంలో మాట్లాడిన కేటీఆర్ తాజాగా మీడియాతో ఇష్టాగోష్టిగా సంభాషిస్తూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ‌లో త‌మ‌ను ఓడించాలని టీఆర్ ఎస్ పార్టీ వ్యతిరేక శక్తులు ఏకం చేశారు. మేం అభివృద్ధి చేశాం కాబట్టే మాకు ఓట్లు పడ్డాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఏపీలో ప్రజలు చంద్రబాబుపై చాలా వ్యతిరేకతో ఉన్నారని తెలిపారు. ఈ సారి చంద్రబాబు నాయుడు పాలిటిక్స్ కి బై బై చెప్పాల్సిందేనని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చక్రం కాదు.. విజయవాడలో బొంగరం కూడా తిప్పలేరని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు.

ఆంధ్ర డేటాను దొంగిలించి మేం ఏం చేసుకుంటామని కేటీఆర్ ప్ర‌శ్నించారు. చంద్రబాబు నాయుడుకి అంత భయం ఎందుకు? ప్రైవేట్ వ్యక్తుల మీద దాడి జరిగితే ఎందుకు భయపడుతున్నారు? ఐటీ గ్రిడ్ మీద దాడి జరిగితే ఏపీ ఐటీ మీద దాడి జరిగినట్లు సృష్టిస్తున్నారంటూ సెటైర్లు వేశారు. సోషల్ మీడియా ద్వారా బాబు చిల్లర రాజకీయం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఐటీ గ్రిడ్స్ వ్యవహారంలో నేరం రుజువు అయితే మొదటి ముద్దాయి ఏపీ ప్రభుత్వమే అవుతుందన్నారు. హైద‌రాబాద్‌ లో ఆస్తులు ఉన్న వాళ్లను తాము బెదిరిస్తున్నామ‌న్న చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌పై స్పందిస్తూ... హైదరాబాద్‌ లో పెద్ద ఆస్తి ఉన్న వ్యక్తి చంద్రబాబేనని సంచలనమైన కామెంట్లు చేశారు. మహా నాయకుడు సినిమా ప్రజలే చూడటం లేదు... బాబు గారు ప్రధాని మోడీని చూడమన్నారంటూ ఎద్దేవా చేశారు.

ఎన్నికలకు పది రోజుల ముందు ఏం చేసినా ప్రజల్లో మార్పు రాదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. విశాఖ రైల్వేజోన్ గురించి ఆయ‌నీ వ్యాఖ్యలు చేశారు. రాబోయే పార్ల‌మెంటు ఎన్నిక‌ల త‌ర్వాత తెలంగాణ ప్రజలే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలకం కాబోతున్నారని వెల్లడించారు. రాఫెల్‌ ను ఐదేళ్ల నుంచి ప్రధాని మోడీ ఎందుకు తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు కేటీఆర్. మరోవైపు ఈ నెల 6వ తేదీ నుండి పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తామని వెల్లడించారు.

Tags:    

Similar News