మరీ మాటలు ఎన్నికలప్పుడు చెప్పరేం కేటీఆర్

Update: 2016-06-21 05:00 GMT
వరాల మీద వరాలు కురిపించి.. ఉక్కిరిబిక్కిరి చేసేసి.. ఇలాంటి హామీలు ఇచ్చిన వారికి తప్పించి మరెవరికి ఓటేస్తామని ఫీలయ్యే నేతలు.. ఎన్నికలు పూర్తయి.. ఘన విజయం సాధించి తమ వారిని అధికార పీఠం మీద కూర్చోబెట్టిన తర్వాత వారి మాటలు మారిపోతుంటాయి. కొత్త నీతులు చెప్పేస్తుంటారు. ప్రజలు అడగకుండానే ఎన్నికల సమయంలో వరాలు ఇచ్చేసే నేతలు.. అధికారం చేతికి వచ్చిన తర్వాత మాత్రం మాట మార్చేస్తుంటారు. అదేమంటే పక్క రాష్ట్రాల ముచ్చట్లు చెప్పుకొస్తారు. మరిన్ని తెలిసిన పెద్దమనిషి.. ఎన్నికలప్పుడు అన్నేసి హామీలు.. వరాలు ఎందుకు ఇచ్చినట్లు? అన్న ప్రశ్న ఎవరూ వేయరు. ఇదంతా ఎవరి గురించి? అన్నసందేహం అక్కర్లేదు. హామీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే తెలంగాన రాష్ట్ర సర్కారు గురించే.

తాజాగా గ్రేటర్ కు సంబంధించిన పలు అంశాలపై తెలంగాణ రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి కేటీఆర్ సుదీర్ఘ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. తండ్రికి తగ్గ తనయుడి మాదిరి ఉదయం మొదలైన ఈ సమీక్షా సమావేశం రాత్రి వరకూ నాన్ స్టాప్ గా సాగింది. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్..పలు అంశాలపై సమీక్షలు నిర్వహించారు.
ఇన్నేసి గంటల పాటు సాగిన సమీక్షలో ప్రజల మీద ప్రభావం చూపించే అంశాలేమిటి? అన్నది చూసినప్పుడు ఆస్తిపన్ను పెంచాల్సి ఉందని తేల్చటమే కాదు.. అందుకు సంబంధించిన ప్రతిపాదనలు ఇవ్వాల్సిందిగా తాను గ్రేటర్ అధికారుల్ని కోరినట్లు కేటీఆర్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన వాదన ఆసక్తికరంగా ఉంది.

‘‘బెంగళూరు మహానగరంలో ప్రతి ఏటా 5 శాతం ఆస్తిపన్ను పెంచుతున్నారు. కానీ.. 14 ఏళ్లుగా గ్రేటర్ లో ఆస్తిపన్ను హేతుబద్ధీకరణ జరగలేదు. అభివృద్ధి జరగాలంటే ఆదాయ వనరులు సమకూర్చుకోవాలి. అందుకే ఆస్తిపన్ను పెంపు ప్రతిపాదనలు ఇవ్వాలని జీహెచ్ ఎంసీ అధికారుల్ని కోరా’’ అంటూ ఉన్న విషయాన్ని ఓపెన్ గా చెప్పేశారు కేటీఆర్.

పన్నుల పెంపు గురించి బెంగళూరు మహానగరాన్ని పోలిక పెడుతూ కేటీఆర్ ఉదాహరణ బాగానే ఉన్నా.. మరి.. ఇలాంటి విషయాలు మొన్నటికి మొన్న ముగిసిన గ్రేటర్ ఎన్నికల సందర్భంగా గుర్తుకు రావా? అన్నది ప్రశ్న. అడగకుండానే పన్నును తగ్గించేస్తూ కేటీఆర్ తండ్రి.. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం గురించి కూడా కేటీఆర్ మాట్లాడితే బాగుండేది. అడగకుండానే వరాలు ఇచ్చేసే తన తండ్రి వైఖరికి భిన్నంగా.. పన్ను మోత తప్పదన్నట్లుగా వ్యాఖ్యానించటం చూసినప్పుడు ఈ తరహా మాటలన్ని ఎన్నికల వేళలో చెబితే ముచ్చటగా ఉంటుంది. కానీ.. ఈ తరహా మాటలు ఎన్నికల వేళ వదిలేసి.. అధికారం చేతికి వచ్చాక చెప్పటం ఏమిటో..?
Tags:    

Similar News