తండ్రిలో జ్యోతిబ‌సు కోణాన్ని చెప్పిన కేటీఆర్

Update: 2017-11-16 05:33 GMT
ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌ల‌కు వేదిక‌గా నిలిచింది తెలంగాణ భ‌వ‌న్‌. ఒక పార్టీని తిట్టే కార్య‌క్ర‌మం పెట్టుకొని స‌ద‌రు పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడ్ని పొగిడే ప‌ని ఎవ‌రైనా చేస్తారా?  ఊహించ‌ని ఈ కాంబినేష‌న్‌ను త‌న మాట‌ల్లో చేసి చూపించారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమారుడు కేటీఆర్‌. తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన ప‌లువురు నేత‌ల్ని టీఆర్ఎస్ లో చేరే కార్య‌క్ర‌మాన్ని టీఆర్ఎస్ భ‌వ‌న్ లో నిర్వ‌హించారు.ఈ సంద‌ర్భంగా టీడీపీపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు కేటీఆర్‌. వీర కామ్రేడ్ గా చెప్పుకునే జ్యోతిబ‌సును కేటీఆర్ గుర్తుకు తెచ్చుకున్నారు.

కాంగ్రెస్ పార్టీ పాల‌న‌తో విసిగి వేసారిపోయిన ప్ర‌జ‌ల కోసం అప్ప‌ట్లో ఎన్టీఆర్ టీడీపీని స్థాపించార‌ని.. తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం టీఆర్ఎస్‌ను కేసీఆర్ షురూ చేశారంటూ గుర్తు చేశారు కేటీఆర్. దేశ చ‌రిత్ర‌లో అత్య‌ధిక కాలం ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసిన రికార్డు జ్యోతిబ‌సు పేరిత ఉంద‌ని.. తెలంగాణ ప్ర‌జ‌ల అభిమానం చూస్తే జ్యోతిబ‌సు రికార్డును తిర‌గ‌రాసే ద‌మ్మున్న వ్య‌క్తి  కేసీఆర్ మాత్ర‌మేన‌న్న నమ్మ‌కం క‌లుగుతోంద‌న్నారు.

ఆస్తిత్వం కోస‌మే తెలంగాణ ఉద్య‌మం జ‌రిగింద‌ని.. అలాంటి చోట ఢిల్లీ నేత‌ల మోచేతి నీళ్లు తాగుతున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయ‌కుల‌కు పుట్ట‌గ‌తులుండ‌వ‌ని విరుచుకుప‌డ్డారు. తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన‌ట్లేన‌న్నారు. టీడీపీ భూపాల‌ప‌ల్లి జిల్లా అధ్య‌క్షుడు గండ్ర స‌త్య‌నారాయ‌ణ‌రావు.. జ‌న‌గామ అధ్య‌క్షుడు మ‌ధుసూద‌న్ రెడ్డి.. రాజ‌న్న సిరిసిల్ల జిల్లా అధ్య‌క్షుడు అన్న‌మ‌నేని న‌ర‌సింగ‌రావు త‌దిత‌రులు త‌మ అనుచ‌రుల‌తో క‌లిసి భారీగా టీఆర్ఎస్‌లో చేశారు.

తాజా చేరిక‌ల‌తో ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్‌.. వ‌రంగ‌ల్ జిల్లాల్లో టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింద‌న్నారు. బీహార్ నుంచి విడిపోయిన జార్ఖండ్ లో ఆర్జేడీ ఏ రీతిలో అయితే త‌న ఉనికిని కోల్పోయిందో అదే రీతిలో తెలంగాణ‌లో టీడీపీ క‌నుమ‌రుగు అవుతుంద‌ని జోస్యం చెప్పారు. గండ్ర స‌త్య‌నారాయ‌ణ చేరిక‌తో భూపాల‌ప‌ల్లి జిల్లాలో పార్టీకి వెయ్యి ఏనుగుల బ‌లం వ‌చ్చింద‌న్నారు. పార్టీలో చేరిన ప్ర‌తిఒక్క‌రికి ప్రాధాన్య‌త ఉంటుంద‌న్న హామీని ఇవ్వ‌టం మ‌ర్చిపోలేదు కేటీఆర్‌.

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బ‌లం త‌గ్గ‌లేద‌ని.. రేవంత్ త‌దిత‌రులు పార్టీ మారిన సంద‌ర్భంగా బాబుతో స‌హా ప‌లువురు టీటీడీపీ నేత‌లు చేసిన ప్ర‌సంగానికి ధీటుగా.. ఆ మాట‌ల‌కు కౌంట‌ర్ అన్న‌ట్లుగా సాగిన తాజా చేరిక‌తో తెలంగాణ‌లో టీటీడీపీకి భారీ న‌ష్టం వాటిల్లింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News