మ‌ళ్లీ అదే సీన్ః జానా వ‌ర్సెస్ కేటీఆర్‌

Update: 2016-12-26 10:39 GMT

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల స‌మావేశాల సంద‌ర్భంగా స‌భ‌లో అధికార‌ప‌క్షం వ‌ర్సెస్ ప్ర‌తిప‌క్షం అనే రీతిలో జోరుగా వాదోప‌వాదాలు సాగుతున్నాయి. తెలంగాణ పారిశ్రామిక‌విధానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై గెలిచి ఇటీవలే అధికార పార్టీలోకి మారిన ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతున్న సమయంలో సీఎల్పీ నేత జానారెడ్డి పాయింట్ ఆఫ్ లేవనెత్తారు. కాంగ్రెస్ కు కేటాయించిన సమయంలో పువ్వాడ మాట్లాడటం స‌రికాద‌ని పేర్కొన్నారు. దీంతో వివాదం చెలరేగగా దీనిపై మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకోవాల్సి రావ‌డంతో అది మ‌రింత ముదిరింది.

ప్ర‌తిప‌క్ష‌మైన‌ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన సమయంలో  పార్టీ మారిన పువ్వాడ అజయ్ ఎలా మాట్లాడతారని జానారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. తమను రెచ్చగొట్టొద్దని సీరియస్ అవుతూ...అధికారాన్ని - అహంకారాన్ని ప్రదర్శించడానికి సభను నిర్వహిస్తున్నారా అని ప్రశ్నించారు. సభ్యుడికి సభలో కేటాయించిన సీట్లో కాకుండా మరోచోట ఉండి ఎలా మాట్లాడతారని జానా సూటిగా ప్రశ్నించారు. గతాన్ని తవ్వొద్దని చెప్పారు. కొత్త రాష్ట్రంలో.. కొత్త ఒరవడిని తీసుకువస్తున్నారని ఆశించాన‌ని అయితే  పాత పద్దతినే కొనసాగిస్తున్నారని.. ఇలా అయితే సభలో ఉండాల్సిన అవసరం లేదని జానారెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అధికార పార్టీ సభ్యుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయ‌న తెలిపారు.  ఈ ప‌రిణామంపై స్పీకర్ మధుసూదనాచారి జోక్యం చేసుకున్నారు. స్పీకర్ కు ఉన్న విచక్షణాధికం ఆధారంగా మాట్లాడటానికి అవకాశం ఇచ్చినట్లు చెప్పారు. ఇందులో రాద్దాంతం చేయాల్సిన అవసరం ఏంటని, సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వటం హక్కు అని స్పీక‌ర్‌ మధుసూదనాచారి అన్నారు.ఇదే స‌మ‌యంలో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ టీఎస్ ఐపాస్ పై మాట్లాడటం కోసం.. స్పీకర్ నుంచి అనుమతి తీసుకున్నానని చెప్పారు. సభలో మాట్లాడటం సభ్యుడిగా హక్కు అని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.

ఈ క్ర‌మంలో జోక్యం చేసుకున్న మంత్రి కేటీఆర్ రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడం కాంగ్రెస్ కు ఇష్టం లేదంటూ జానా వైఖరిని త‌ప్పుపట్టారు. స్పీకర్ విచక్షణలో ఉన్న అంశాన్ని ప్రశ్నించడం ఎంత వరకు సబబు అని కేటీఆర్ నిలదీశారు. ప్రజలే మమ్మల్ని స‌భ‌లో కూర్చోపెట్టారే త‌ప్ప కాంగ్రెస్ దయాదాక్షణ్యాలపై సభలోకి రాలేదంటూ జానా వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ప్రజలు వద్దు అనుకున్నప్పుడు ఇక్కడ కూర్చోలేము కదా అని చురకలు అంటించారు. పార్లమెంటరీ సంప్రదాయాలను గుర్తుంచుకోవాలని.. స్పీకర్ నిర్ణయాలను ప్రశ్నించటం ఏంటని జానా వ్యాఖ్యలపై మండిపడ్డారు. స్పీకర్ నిర్ణయాన్ని ధిక్కరించే అధికారం సభ్యులకు లేదన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News