కాంగ్రెస్ గురించి ఆలోచ‌నే లేదంటున్న కేటీఆర్‌

Update: 2017-04-04 14:35 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు - రాష్ట్ర మున్సిపల్ - ఐటీ శాఖల మంత్రి కే తారక రామారావు కారు జోరు గురించి భలే ధీమాగా ఉన్న‌ట్లున్నారు. ఇన్నాళ్లు ప్ర‌తిప‌క్ష‌మైన టీడీపీ గురించి కామెంట్లు చేసిన కేటీఆర్ ప్ర‌స్తుతం త‌న గురిని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ వైపు మ‌రల్చారు. తాజాగా ఆయ‌న పార్టీ కార్యక్ర‌మంలో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీది ముగిసిన కథేనని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగు నీరందించేందుకు సీఎం కేసీఆర్ ప్రాజెక్టులను చేపడుతుంటే.. వాటిని ఆపేందుకు కాంగ్రెస్ పార్టీ కేసులు పెడుతోంద‌దని మండిపడ్డారు.టీఆర్‌ ఎస్ ప్రభుత్వం చెప్పిన విధంగానే రాష్ట్రవ్యాప్తంగా కోటి ఎకరాలకు సాగు నీరందిస్తుందని కేటీఆర్ స్పష్టంచేశారు.

టీఆర్ ఎస్ పార్టీ స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలపై నిప్పు లు చెరిగారు. చేవెళ్ళ సెంటిమెంట్ అంటూ అప్పటి సీఎం వైఎస్ చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టును చేపట్టి కేవలం రూ.36 కోట్లను మాత్రమే ఖర్చు చేసి కాలువలు తవ్వి వదిలేశారు తప్ప.. ఒక్క పైసా పని కాలేదని కేటీఆర్ గుర్తుచేశారు. మొబిలైజేషన్ పేరిట కాంట్రాక్టర్లకు కాంగ్రెస్ నేతలు దోచిపెట్టారని ఆయన దుయ్యబట్టారు. పాలమూరు జిల్లా పచ్చబడేలా ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందో, అదేవిధంగా పశ్చిమ రంగారెడ్డి జిల్లాలోని ఐదు లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తామన్నారు. అధికారంలోకి రావడానికి గడ్డాలు, మీసాలు పెంచుతున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టులను ఆపేందుకు కుట్రలు పన్నుతున్నారని కేటీఆర్‌ మండిపడ్డారు. కేసులు స్పీడ్ బ్రేకర్లు మాత్రమేనని, కేసులను అధిగమించేందుకు తమ దగ్గర పక్కా ప్లాన్ ఉందని కేటీఆర్ చెప్పారు.

55 ఏళ్ల‌పాటు దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా.. ఏ అభివృద్ధి చేయకుండా, ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని కేటీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు గుడ్డి గుర్రాల పళ్లు తోమారా? అంటూ కాంగ్రెస్ నేతలను ఎద్దేవా చేశారు. రైతుల నోట్లో మట్టి కొట్టేలా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రంగారెడ్డి జిల్లాకు సాగునీరు రాదంటూ సీఎం కేసీఆర్‌పై, టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నారన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా రంగారెడ్డి జిల్లాకు సాగు నీరందిస్తామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చేందుకు కృషి చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా కష్టాలు పడిన రైతులకు టీఆర్‌ ఎస్ ప్రభుత్వంలో మంచి రోజులొచ్చాయని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ హయాంలో కేవలం అర్ధరాత్రి కరెంట్ సరఫరా ఉండడంతో పొలాల వద్దకు వెళ్లిన రైతులు పాములు, తేళ్లు కుట్టి మరణించారన్నారు. అప్పట్లో ఎరువులు, విత్తనాలకోసం తొక్కిసలాటలు జరిగేవని, ఆఖరుకు పోలీస్ స్టేషన్లలో ఎరువులు పెట్టి అమ్మించారని చెప్పారు. సిరిసిల్లలో ముని ఎల్లయ్య అనే రైతు ఎరువులకోసం క్యూ లైన్‌లో నిల్చొనే చనిపోయారని కేటీఆర్ గుర్తుచేశారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన అనంతరం ఎరువులు, విత్తనాలను సకాలంలో అందిస్తున్నామని చెప్పారు. వ్యవసాయానికి పగటిపూటతోపాటు రాత్రి సమయంలో కూడా తొమ్మిది గంటలపాటు నాణ్యమైన కరెంట్ సరఫరా చేస్తున్నామని మంత్రి తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News