ఆలీబాబా 40 దొంగ‌ల క‌థ‌ను కేటీఆర్ స్టైల్లో!

Update: 2018-03-01 06:06 GMT
టీఆర్ ఎస్ పార్టీ అధినేత‌ - తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాట తీరు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు. మాట‌లే కేసీఆర్ బ‌లం. ఆ ప్ర‌త్యేక‌త‌తోనే త‌న‌న రాజ‌కీయ జీవితంలో పైచేయి సాధించారు. పిట్ట‌క‌థ‌లు - ఆకట్టుకునే పంచ్‌ లు కేసీఆర్ స్టైల్‌. అలా గులాబీ ద‌ళ‌ప‌తి స్టైల్లోనే ఆయ‌న కుమారుడు కేటీఆర్‌ కూడా న‌డుస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. తాజాగా ఆయ‌న చేసిన ప్ర‌సంగం ఇందుకు నిద‌ర్శ‌నం. తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని 175 పల్లెలకు తాగునీటిని అందించే మిషన్ భగీరథ పనులు పూర్తికాగా వాటిని మంత్రి జగదీశ్‌ రెడ్డి - భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ - తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌ కుమార్‌ లతో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం జరిగిన భారీ బహిరంగసభలో కేటీఆర్‌ ప్రసంగించారు. యాభై ఏళ్లుగా తెలంగాణకు అన్యాయం చేసిన ద్రోహుల చరిత్ర కాంగ్రెస్‌ దని విమర్శించారు.

నలభైమంది కాంగ్రెస్ నేతలు బస్సు వేసుకుని జనారణ్యానికి వస్తున్నారన్న కేటీఆర్.. అలీబాబా 40 దొంగల కథను ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ నేతలది జానాబాబా 40 దొంగల పర్యటన అని అభివర్ణించారు. `ఓ 40మంది కాంగ్రెస్ నాయకులు ఓ బస్సు వేసుకొని బయలుదేరారు. ఆ నలభై మందీ అక్రమార్కులే. ఒకరు ఓటుకు నోటులో దొరికిన చిల్లర దొంగ. మరొకరు గత ఎన్నికల సమయంలో కోదాడలో మూడు కోట్లతో దొరికిన దొంగ. ఇలా చెప్తూపోతే అందరూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నవారే` అని కేటీఆర్ విమర్శించారు. ఏళ్ల‌త‌ర‌బ‌డి ఏలిన కాంగ్రెస్ నేతలు తెలంగాణను నట్టేట ముంచారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ.. ఉద్యమనేత కేసీఆర్ సీఎం అయిన నాటినుంచి మూడున్నరేళ్ల‌లోనే దేశానికే రోల్‌ మోడల్‌ గా నిలుస్తూ అన్ని రంగాల్లో ఉరుకులు పెడుతోంది` అని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో నత్తలు సిగ్గుపడే రీతిలో అభివృద్ధి పనులు జరిగాయని, దానికి నిదర్శనం శ్రీరాంసాగర్ ప్రాజెక్టేనని చెప్పారు. రాహుల్‌ గాంధీ ముత్తాత అయిన నెహ్రూ హయాంలో శ్రీరాంసాగర్‌ కు శంకుస్థాపన చేస్తే - 50 ఏళ్ల‌పాటు పనులు కదల్లేదన్నారు. కానీ కేవలం మూడున్నరేళ్ల‌ టీఆర్‌ ఎస్ పాలనలో గోదావరి నీళ్లు పారబోతున్నాయని చెప్పారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధి - సంక్షేమంపై సుదీర్ఘ ఆలోచన చేసిన కేసీఆర్ అనేక సమస్యలు - సవాళ్లను అధిగమిస్తూ ముందుకు సాగుతుంటే యాభైఏళ్లు అధికారంలో ఉన్నవారు ఆంధ్రా పాలకుల దోపిడీని కళ్ల‌ప్పగించి చూస్తూ ఆస్తులు - ఆకారాలు పెంచుకున్నారు తప్ప ఈ ప్రాంతానికి ఒరగబెట్టింది శూన్యమని కేటీఆర్ ప్ర‌శ్నించారు. నాటి ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్ తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వనన్నా తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలెవ్వరూ ఎదిరించి అడిగిన పాపానపోలేదని - చీమూనెత్తురు కోల్పోయినవారిలా వ్యవహరించారని కేటీఆర్ విమర్శించారు. తన సొంత జిల్లా చిత్తూరుకు తాగునీటికి రూ.9వేల కోట్లు తీసుకెళుతానని కిరణ్‌ కుమార్‌ రెడ్డి క్యాబినెట్‌ లో పెడితే - ప్రస్తుతం జానాబాబా దొంగల ముఠాలో ఉన్నవారు మంత్రులుగా ఉండి - మౌనంగా సంతకం పెట్టారు తప్ప నల్లగొండలో ఫ్లోరిన్ ఉంది - ముందు మాకివ్వండి అని అడుగలేదు అని గుర్తుచేశారు. కాంగ్రెస్ నేతలకు ఎప్పుడు కాంట్రాక్టులు దక్కుతాయి? ఎలా సంపాదించుకోవాలి? అనే ఆలోచనే తప్ప ప్రజల సమస్యల పరిష్కారం పట్టదని విమర్శించారు. `రైతుల పరిస్థితి కాంగ్రెస్ పాలనలో ఎట్లా ఉంది? ఎంత దారుణంగా ఉంది? కాల్వలు ఉన్నాయి తప్ప నీరు రాలే. బోరుబావుల మీద ఆధారపడి వ్యవసాయం చేద్దామంటే తొమ్మిది గంటలు కాదు.. ఆరు గంటలు కరంటు ఇస్తామన్నారు. అందులో కూడా పొద్దున్న రెండు గంటలు - మధ్యాహ్నం రెండు గంటలు - రాత్రి రెండు గంటలు ఇచ్చారు. ఆ అర్ధరాత్రి కరంట్ కోసం బావుల వద్ద కరెంట్ షాకులతో - పాములు కుట్టి చనిపోయినవారు ఎందరో. ఇలాంటివి చెప్పుకొంటూ పోతే మాకు ప్రజలు ఇచ్చిన గడువు సరిపోదు. కేవలం అభివృద్ధి చేయాలనే కంకణం కట్టుకొని మా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది` అని కేటీఆర్ చెప్పారు. టీఆర్‌ ఎస్ ప్రభుత్వం ఇస్తున్న సౌకర్యాలతో నేడు దర్జాగా కాలు మీద కాలేసుకున్న కాంగ్రెస్ నాయకులు.. తిన్నది అరుగక మాట్లాడుతున్నారని మంత్రి ధ్వజమెత్తారు.
Tags:    

Similar News