జ‌గ‌న్ గెలుపులో కేసీఆర్ క్రెడిట్ తీసుకోర‌ట‌!

Update: 2019-05-29 04:36 GMT
ఏపీలో జ‌గ‌న్ గెలిచారు. అది కూడా అలాంటి ఇలాంటి గెలుపు కాదు. చరిత్ర‌లో నిలిచిపోయేలా గెలిచారు. అది కూడా ఒంట‌రిగా. ఎవ‌రిమీదా ఆధార‌ప‌డ‌కుండా.. సొంత బ‌లంతో.. రెక్క‌ల క‌ష్టంతో ఆయ‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు. ఏపీకి కాబోయే ముఖ్య‌మంత్రి అయ్యారు. ఎన్నిక‌ల వేళ‌.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌రోక్షంగా మ‌ద్ద‌తు ఇవ్వ‌టం వ‌ల్లే జ‌గ‌న్ గెలిచార‌న్న వాద‌న ఉంది.

ఏపీలో జ‌గ‌న్ గెలుపు కేసీఆర్ పుణ్య‌మ‌ని గులాబీ నేత‌లు కొంద‌రు వ్యాఖ్య‌లు చేస్తున్న ప‌రిస్థితి. అయితే.. అలాంటి వాద‌న‌ను మొగ్గ‌లోనే తుంచేశారు టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తాజాగా ఆయ‌న జ‌గ‌న్ గెలుపు మీద స్పందించారు. తాము ఎలాంటి మ‌ద్ద‌తు ఇవ్వ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. అంతేకాదు.. ఏపీ ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పు చూసిన త‌ర్వాత ఎవ‌రైనా ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌టం స‌రికావంటున‌నారు.

టీఆర్ఎస్ స‌హ‌కారంతో జ‌గ‌న్ గెలిచార‌న్న‌ది స‌రైన‌ది కాద‌ని.. అక్క‌డి ప్ర‌జ‌ల తీర్పే అందుకు నిద‌ర్శ‌నంగా చెప్పారు. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సొంతంగా తెలిచార‌ని.. 3600 కి.మీ.కు పైగా పాద‌యాత్ర చేశార‌ని గుర్తుచేశారు. జ‌గ‌న్ గెలుపులో ఎవ‌రూ క్రెడిట్ తీసుకోలేర‌న్న విష‌యాన్ని కేటీఆరే స్ప‌ష్టం చేయ‌టం విశేషం.

ఇదిలా ఉంటే.. ఇరుగుపొరుగు రాష్ట్రాల‌తో చ‌క్క‌గా ఉండాల‌ని తాము కోరుకుంటామ‌ని.. త‌మ ప్ర‌భుత్వ విధానం కూడా అదేన‌ని చెప్పారు. మ‌హారాష్ట్ర.. క‌ర్ణాట‌క‌ల‌తో ఎలాంటి సంబంధాలు నెరుపుతున్నామో.. ఏపీతోనూ అలాంటి రిలేష‌న్ నే తాము కోరుకుంటున్న‌ట్లు చెప్పారు. ప్ర‌మాణ‌స్వీక‌రానికి ఏపీకి రావాల‌ని జ‌గ‌న్ కోరారు త‌ప్పించి.. మ‌రింకేమీ త‌మ మ‌ధ్య మాట‌లు జ‌ర‌గ‌లేద‌ని చెప్పాలి. ఇన్ని మాట‌లు చెప్పిన కేటీఆర్.. కేసీఆర్.. జ‌గ‌న్ మ‌ధ్య జ‌రిగిన ఏకాంత భేటీలో ఏం మాట్లాడుకున్నార‌న్న విష‌యం మీదా కాసింత క్లారిటీ ఇచ్చి ఉంటే బాగుండేది క‌దా?
Tags:    

Similar News