కేటీఆర్ ట్వీట్ యాక్ష‌న్‌!..బ‌డిలో ప‌డ్డ చాయ్‌ వాలా!

Update: 2017-12-19 23:30 GMT
టీఆర్ఎస్ యువ‌నేత‌ - తెలంగాణ యువ మంత్రి కల్వ‌కుంట్ల తార‌క‌రామారావు (కేటీఆర్‌) సోష‌ల్ మీడియాలో ఎంత స్పీడుగా ఉంటారో అంద‌రికీ తెలిసిందే. సోష‌ల్ మీడియా వేదిక‌ ట్విట్ట‌ర్ య‌మా యాక్టివ్ గా ఉండే కేటీఆర్.. దాని వేదిక‌గా త‌న‌కు వ‌చ్చే ఫిర్యాదుల‌పై చాలా క్విక్‌గా రియాక్ట్ అవుతూ ఉంటారు. ఈ త‌ర‌హా క్విక్ రియాక్ష‌న్‌ తో కేటీఆర్ చాలా స‌మ‌స్య‌ల‌ను క్ష‌ణాల్లో ప‌రిష్క‌రించేశారు కూడా. కేటీఆర్ కు ఉన్న ఈ హ్యాబిట్‌ ను తెలుసుకున్న జ‌నం కూడా త‌మ‌కు ఎదరైన స‌మ‌స్య‌ల‌ను ట్విట్ట‌ర్ వేదిక‌గానే కేటీఆర్‌ కు తెలిపేందుకు య‌త్నిస్తున్నారు. అదే స‌మ‌యంలో ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌న‌కు అందుతున్న ఆయా స‌మ‌స్య‌ల‌ను కేటీఆర్ అంతే వేగంగానే ప‌రిష్క‌రించేస్తున్నారు. తాజాగా ఈ త‌ర‌హాలోనే కేటీఆర్ ప‌రిష్క‌రించిన ఓ ఆస‌క్తిక‌ర‌మైన స‌మ‌స్య ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ గా మారిపోయింది. ట్విట్ట‌ర్ వేదిక‌గా వ‌చ్చిన ఓ ఫిర్యాదుకు కేటీఆర్ చాలా వేగంగా స్పందించిన నేప‌థ్యంలో అప్ప‌టిదాకా స్కూల్ ఫీజులు క‌ట్టలేక‌... బ‌డి మానేసి టీ బాయ్‌ గా మారిన ఓ చాయ్‌ వాలా నేరుగా స‌ర్కారీ రెసిడెన్షియ‌ల్ స్కూల్లో ప‌డిపోయాడు.

ఈ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న వివ‌రాల్లోకి వెళితే... హైద‌రాబాదులోని బంజారా హిల్స్ రోడ్ నెం:10లో ఉన్న సిటీ సెంట‌ర్ మాల్ వ‌ద్ద రోడ్డుపై వెల‌సిన ఓ టీ కొట్టులో 15 ఏళ్ల వ‌య‌సున్న స‌మీయుద్దీన్ పైజాన్ అనే బాలుడు టీ అమ్ముతున్నాడు. అప్ప‌టిదాకా ఓ ప్రైవేట్ స్కూల్లో విద్య‌న‌భ్య‌సించే పైజాన్‌... ఆ త‌ర్వాత బ‌డి మానేయ‌డానికి అత‌డి కుటుంబ ఆర్థిక ప‌రిస్థితులే కార‌ణ‌మ‌ట‌. స్కూల్ ఫీజులు క‌ట్ట‌లేక తండ్రి చేతులెత్తేయ‌డంతో పైజాన్ స్కూల్ బ్యాగును ఇంటిలో ప‌డేసి టీ కేటిల్ ప‌ట్టుకోక త‌ప్ప‌లేదు. అయితే ఈ ప‌రిస్థితిని గ‌మ‌నించిన రియాజుద్దీన్ అనే యువ‌కుడు పైజాన్ దీన గాథ‌ను కేటీఆర్ ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌తో పాటు టీ అమ్ముకుంటున్న పైజాన్ ఫొటోను జ‌త చేసిన రియాజుద్దీన్‌.... ప్ర‌భుత్వం త‌ల‌చుకుంటే ఆ టీ బాయ్‌.. మ‌ళ్లీ బ‌డిలో చేర‌తాడంటూ కేటీఆర్‌ కు ఓ విజ్ఞ‌ప్తిని పెట్టాడు.

ఈ ట్వీట్ కు క్విక్‌ గా రియాక్ట్ అయిన కేటీఆర్‌... పైజాన్ చ‌దువు ప్ర‌భుత్వానిదే బాధ్య‌త అన్న రీతిలో స్పందించ‌డ‌మే కాకుండా ప్ర‌భుత్వ రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల‌లో పైజాన్‌ ను చేర్పించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని రిప్లై ఇచ్చార‌ట‌. రిప్లై ఇవ్వ‌డంతోనే స‌రిపెట్ట‌ని కేటీఆర్‌.. స‌ద‌రు ట్వీట్‌ ను రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల‌ల‌ను ప‌ర్య‌వేక్షించే సంస్థ అధికారుల‌కు పంపించి... త‌క్ష‌ణ‌మే పైజాన్ విద్యాభ్యాసానికి అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశాలు జారీ చేశార‌ట‌. కేటీఆర్ ఆదేశాల‌తో వెంట‌నే రంగంలోకి దిగిపోయిన అధికారులు పైజాన్ త‌ల్లిదండ్రుల‌తో మాట్లాడి ఇప్ప‌టికే వివ‌రాలు సేక‌రించార‌ట‌. ఇక రేపో - మాపో పైజాన్ టీ కేటిల్‌ ను న‌డి రోడ్డు మీదే వ‌దిలేసి... చ‌క్క‌గా రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల మెట్లు ఎక్క‌డం గ్యారెంటీగానే క‌నిపిస్తోంది.
Tags:    

Similar News