చంద్రబాబుకో హఠావో!.. ఆంధ్రాకో బచావో!

Update: 2016-05-23 07:16 GMT
 కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న పాలమూరు- రంగారెడ్డి - డిండి ప్రాజెక్టులకు నిరసనగా ఏపీ కాంగ్రెస్ విజయవాడలో చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో ఆ పార్టీ సీనియర్ నేతలు కదం తొక్కారు. ముఖ్యంగా రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రారావు నినాదాలతో హల్ చల్ చేశారు. ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన పలు ప్రయోజనాలను సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారని ఆయన విరుచుకుపడ్డారు. అంతేకాక విభజన చట్టం ప్రకారం ఏపీకి ప్రకటించాల్సిన ప్రత్యేక హోదా - ప్రత్యేక ప్యాకేజీలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నోరు మెదపకపోవడంపై మండిపడ్డారు. ‘చంద్రబాబుకో హఠావో... ఆంధ్రాకో చావో‘ - ‘మోదీ కో హఠావో... ఆంధ్రాకో బచావో’ - ‘టీడీపీ, బీజేపీ హఠావో... ఆంధ్రాకో బచావో’  అంటూ కేవీపీ నినదించారు. పెద్ద స్వరంతో కేవీపీ నినాదాలు చేయగా, నిరసన ప్రదర్శనకు హాజరైన కాంగ్రెస్ కార్యకర్తలు - నేతలు కూడా ఆయనతో గొంతు కలిపారు.  అయితే... కేవీపీ హఠావో.. బచావో అంటూ నినాదాలు చేయడంతో ఆయన విజయవాడలో నిరసన చేస్తున్నారా ఢిల్లీలో చేస్తున్నారా అన్నట్లుగా కనిపించింది.

ధ‌ర్నాలో ఏపీసీసీ అధ్య‌క్షుడు ర‌ఘువీరా రెడ్డి కూడా సీఎం చంద్ర‌బాబుపై నిప్పులు చెరిగారు. ‘గోదావ‌రి - కృష్ణా డెల్టాల్లో తాగునీరు లేదు - గుక్కెడు నీళ్ల కోసం కిలోమీటర్లు వెళ్లాల్సిన ప‌రిస్థితి ఏపీలో ఉంది’ అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. ఏపీలో ఏర్ప‌డ్డ క‌ర‌వుపై, తెలంగాణ నిర్మిస్తోన్న ప్రాజెక్టుల‌పై చంద్ర‌బాబు నాయుడు ఇంత‌వ‌ర‌కూ నోరు తెర‌వలేద‌ని ఆయ‌న విమ‌ర్శించారు.  ‘ముఖ్య‌మంత్రి గారూ.. మీ ఊళ్లో కూడా ఈరోజు తాగ‌డానికి నీళ్లు లేవు’ అంటూ రఘువీరా ఎద్దేవా చేశారు.

చంద్ర‌బాబుకు కేసీఆర్ అంటే భయమని.. ఓటుకు నోటు కేసులో జైలుకు పంపిస్తారన్న భయంతో కేసీఆర్ కు వ్యతిరేకంగా చంద్రబాబు ఒక్క మాట కూడా ఆడడం లేదని ఆరోపించారు. చంద్రబాబు బలహీనత - భయం చూసుకునే కేసీఆర్ అడ్డగోలుగా ప్రాజెక్టులు కట్టి ఏపీకి నీరు రానివ్వకుండా చేస్తున్నారంటూ మండిపడ్డారు.
Tags:    

Similar News