బాబు జ‌మానాలో ప్రోటోకాల్ అమ‌లు ఇంతేనా?

Update: 2018-04-14 13:54 GMT
టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు పాల‌న‌లో విపక్షాల‌కు చెందిన నేత‌ల‌కు ఏ త‌ర‌హా ప్రోటోకాల్ ద‌క్కుతుందో క‌ళ్ల‌కు క‌ట్టే ఉదంత‌మిది అంటూ ఇప్పుడు కాంగ్రెస్ రాజ్య‌స‌భ స‌భ్యుడు కేవీపీ రామ‌చంద్రారావు సంచ‌ల‌న ఆరోప‌ణ‌ల‌కు దిగారు. అస‌లు ఎంపీలు అంటే... టీడీపీకి చెందిన పార్ల‌మెంటు స‌భ్యులు మాత్ర‌మేనా?  విప‌క్షాల‌కు చెందిన ఎంపీలు పార్ల‌మెంటు స‌భ్యులు కాదా? అన్న కోణంలో స‌రికొత్త వాద‌న‌ను తెర‌పైకి తీసుకొచ్చిన కేవీపీ... చంద్ర‌బాబు సర్కారు వ్య‌వ‌హార స‌ర‌ళిని బ‌హిరంగంగానే దునుమాడేస్తున్నారు. రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్న త‌న‌కు ప్రోటోకాల్ ప్ర‌కారం ఏర్పాట్లు చేయ‌కుండా... మ‌హాత్మా జ్యోతిరావు పూలే విగ్ర‌హానికి నివాళి అర్పించేందుకు కూడా అనుమతించ‌ని వైనంపై ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి కేవీపీ ఓ లేఖాస్త్రం సంధించారు. ఈ లేఖాస్త్రం ద్వారా బాబు స‌ర్కారు విప‌క్ష ఎంపీల‌కు ఏ మేర‌కు గౌర‌వం ఇస్తుంద‌న్న విష‌యాన్ని కేవీపీ బాగానే బ‌య‌ట‌పెట్టేశార‌న్న వాద‌న వినిపిస్తోంది.

అయినా కేవీపీకి ఏ త‌ర‌హా అవ‌మానం జ‌రిగింద‌న్న విషయానికి వస్తే... జ్యోతిరావు పూలే జ‌యంతిని పుర‌స్క‌రించుకుని ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ త‌ర‌ఫున విజ‌య‌వాడ‌లోని పూలే విగ్ర‌హానికి నివాళి అర్పించేందుకు పీసీసీ అధ్య‌క్షుడి హోదా ర‌ఘువీరారెడ్డి, ఆ పార్టీ ఎంపీ హోదాలో కేవీపీ రామ‌చంద్రారావు, పార్టీ సీనియ‌ర్లు జేడీ శీలం, గిడుగు రుద్రరాజు, పల్లంరాజు తదిత‌రులు వ‌చ్చారు. అయితే ప్ర‌భుత్వ ఆదేశాల‌తోనే రంగంలోకి దిగిపోయిన బెజ‌వాడ పోలీసులు ర‌ఘువీరా, కేవీపీ స‌హా మొత్తం 12 మంది కాంగ్రెస్ ప్ర‌ముఖుల‌ను అరెస్ట్ చేయ‌డంతో పాటుగా వారిపై కేసులు న‌మోదు చేశారు. దీనిపై నాడే ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన కేవీపీ... ఇదెక్కడి తీర‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పార్ల‌మెంటు స‌భ్యుడిగా త‌న‌కు ఇవ్వాల్సిన మ‌ర్యాద కూడా ఇవ్వ‌కుండా పోలీసులు అరెస్ట్ చేయ‌డ‌మేమిట‌ని కూడా ఆయ‌న ప్ర‌శ్నించారు. త‌మ‌ను అకార‌ణంగా అరెస్ట్ చేయ‌డమే కాకుండా ప్రోటోకాల్‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించిన బెజ‌వాడ పోలీసుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న ఏపీ స‌ర్కారుకు లేఖ రాశారు. అయితే ఇప్ప‌టిదాకా త‌న లేఖ‌కు స్పంద‌నే రాలేద‌ని కేవీపీ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

అసలు తాము చేసిన త‌ప్పేంటో కూడా చెప్ప‌కుండా అరెస్టులు ఎలా చేస్తార‌ని కూడా ఆయ‌న ప్ర‌శ్నించారు. ఏపీ ప్ర‌భుత్వప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి రాసిన స‌ద‌రు లేఖ‌లో జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా విజయవాడలో ఘర్షణలు జరగడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. ఎంపీనైన త‌న ప‌ట్ల దురుసుగా వ్య‌వ‌హ‌రించిన పోలీసుల‌పై మూడు రోజులు గ‌డుస్తున్నా ప్రభుత్వం ఇప్పటివరకూ చర్యలు తీసుకోలేదన్నారు. మహాత్మల జయంతి, వర్థంతులకు ప్రముఖులను ఆహ్వానించడం ఆనవాయితీ అని, కానీ విజయవాడలో పోలీసులు ఓవరాక్షన్‌ చేశారని కేవీపీ ఆరోపించారు. జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసేందుకు కూడా అంగీకరించలేదని, అంతేకాకుండా తమను బలవంతంగా పోలీస్‌ స్టేషన్‌కు తరలించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రోటోకాల్‌ ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకోవాలని కేవీపీ లేఖలో కోరారు. మొత్తంగా బాబు జ‌మానాలో ప్ర‌జా ప్ర‌తినిధులు అంటే... అధికార పార్టీకి చెందిన వారేన‌న్న భావ‌న వ్య‌క్త‌మవుతోంద‌న్న వైనాన్ని కేవీపీ త‌న లేఖ ద్వారా బ‌య‌ట‌పెట్టిన‌ట్టుగా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.
Tags:    

Similar News