ఈ స్నేహంతో... చెయ్యి విరుగుతుందా...

Update: 2018-11-04 11:18 GMT
కేంద్రంలో భార‌తీయ జ‌న‌తా పార్టీని - తెలంగాణ‌లో తెలంగాణ రాష్ట్ర స‌మితిని అధికారం నుంచి త‌ప్పించేందుకు కొత్త స్నేహం కుదుర్చుకున్న కాంగ్రెస్ - తెలుగుదేశం పార్టీలకు ఎలాంటి మేలు జ‌రుగుతుందో భ‌విష్య‌త్ నిర్ణ‌యించినా.... ప్ర‌స్తుతానికి మాత్రం రెండు పార్టీల‌కు మాత్రం ఎదురుదెబ్బ త‌గులుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి మాత్రం దెబ్బ మీద దెబ్బ త‌గులుతోంది. తెలుగుదేశం పార్టీ  కాంగ్రెస్ పార్టీతో త‌న మిత్ర‌త్వం ప్రారంభించిన వెంటనే  కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ‌లు త‌గ‌ల‌డం ప్రారంభ‌మైంది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు - ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని క‌లిసిన వెంట‌నే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ నాయ‌కులు ఒక్కొక్క‌రే పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోతున్నారు. ముందుగా పార్టీలో మూడున్న‌ర ద‌శాబ్దాలుగా సీనియ‌ర్ నాయ‌కుడిగా - మంత్రిగా ప‌ని చేసిన వ‌ట్టి వ‌సంత‌కుమార్ పార్టీకి రాజీనామా చేశారు. చంద్ర‌బాబు నాయుడు గురించి తెలుసున్న కాంగ్రెస్ నాయ‌కులు ఆయ‌న‌తో క‌ల‌వ‌డాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నారు. దీంతో పార్టీని న‌మ్ముకున్న త‌మ‌ను కాద‌ని చంద్ర‌బాబు నాయుడుతో చెలిమి చేయ‌డం ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ నాయ‌కులకు మింగుడుప‌డ‌డం లేదు.

చంద్ర‌బాబు నాయుడు - రాహుల్ గాంధీల స్నేహం కారణంగా మ‌రో సీనియ‌ర్ నాయ‌కుడు సి.రామ‌చంద్ర‌య్య కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఈ కొత్త  స్నేహంపై రామ‌చంద్ర‌య్య విరుచుకుప‌డుతున్నారు. చంద్ర‌బాబు నాయుడు గురించి తెలుసున్న వారు ఎవ్వ‌రూ ఆయ‌న‌తో చెలిమి చేయ‌ర‌ని - రాహుల్ గాంధీ వైఖ‌రి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో పార్టీ పూర్తిగా నాశ‌నం అయిపోయింద‌ని - అలాంటి స‌మ‌యంలో కూడా తామంతా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నామ‌ని - అలాంటిది త‌మ‌ను సంప్ర‌దించ‌కుండా తెలుగుదేశం పార్టీతో క‌ల‌వ‌డంపై ఆగ్ర‌హంగా ఉన్నారు. ఇక పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు కె.వి.రామ‌చంద్ర‌రావు అయితే త‌న స‌న్నిహితుల వ‌ద్ద ర‌గిలిపోతున్న‌ట్లు స‌మాచారం. త‌న ప్రాణ స్నేహితుడు వై.ఎస్.రాజ‌వేఖ‌ర రెడ్డి మ‌ర‌ణించిన త‌ర్వాత ఆయ‌క కుమారుడు పెట్టిన రాజ‌కీయ పార్టీలో కూడా కె.వి.పి.రామ‌చంద్ర రావు చేర‌లేదు. ఎన్ని అవ‌మానాలు ఎదురైనా తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాన‌ని - ఇప్పుడు చంద్ర‌బాబు నాయుడితో క‌ల‌వ‌డం వ‌ల్ల మాన‌సికంగా ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని ఆయ‌న త‌న స‌న్నిహితుల వ‌ద్ద వాపోయిన‌ట్లు చెబుతున్నారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ప్ర‌యోజ‌నాల కోసం ఆంధ్ర‌ప్రదేశ్ ను చీల్చార‌ని, దీని కార‌ణంగా త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్ నాశ‌నం అయ్యింద‌ని కాంగ్రెస్ నాయ‌కులు అంటున్నారు. పొత్తులు ఖ‌రారు అయిన కాంగ్రెస్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి చాలా మంది బ‌య‌ట‌కు వెళ్లిపోతార‌ని అంటున్నారు. అలాంటి వారితో ముందుగానే సంప్ర‌దింపులు జ‌ర‌పాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీకి అధిష్టానం చెప్పిన‌ట్లు స‌మాచారం. మొత్తానికి చంద్ర‌బాబుతో చెలిమి కార‌ణంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ ఏ మేర‌కు న‌ష్ట‌పోతుందో భ‌విష్య‌త్‌ లో తేల‌నుంది. 
Tags:    

Similar News