బాబు ర‌మ్మ‌న్నార‌ట‌... ల‌గ‌డ‌పాటి వెళ్లార‌ట‌!

Update: 2017-09-12 10:53 GMT
అస్త్ర స‌న్యాసం చేశాన‌ని, ఇక‌పై రాజ‌కీయాల్లోకి రాన‌ని బీరాలు ప‌లికిన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విజ‌య‌వాడ మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ మ‌రోమారు పెను క‌ల‌క‌లం రేపారు. ఏ ఎన్నిక‌లు జ‌రిగినా త‌న ఫ్లాష్ టీంతో స‌ర్వే చేసి కాస్తంత అటూ ఇటూగా ప‌క్కా ప్రిడిక్ష‌న్ ఇచ్చే ల‌గ‌డ‌పాటి... మొన్న‌టి నంద్యాల ఉప ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ స‌ర్వే జ‌రిపారు. ఆ స‌ర్వే విష‌యంలో ల‌గ‌డ‌పాటి రెండు మాట‌లు చెప్పిన‌ట్లుగా క‌థ‌నాలు వినిపించాయి. నంద్యాల బైపోల్స్‌లో విజ‌యావ‌కాశాలు వైసీపీకే ఉన్నాయ‌ని తొలుత చెప్పిన రాజ‌గోపాల్‌... ఆ త‌ర్వాత ఏమైందో గానీ... మాట మార్చేసి టీడీపీదే విజ‌య‌మంటూ చెప్పేశారు. అంత‌కుముందెన్న‌డూ లేని విధంగా ల‌గ‌డ‌పాటి నోట నుంచి వ‌చ్చిన ఈ మాటపై పెద్ద చ‌ర్చే జ‌రిగింది. అయితే అంత‌కంటే చాలా రోజుల ముందుగా ఓ రోజు ఆయ‌న ఉన్న‌ట్టుండి టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. ఆ భేటీతో ఆయ‌న టీడీపీలో చేర‌నున్నార‌ని, రాజ‌కీయ స‌న్యాస‌మంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌న్నీ ఒట్టిమాట‌లేన‌న్న ప్ర‌చారం జ‌రిగిన విషయం తెలిసిందే.

అయితే చంద్ర‌బాబుతో త‌న భేటీ ఎలాంటి రాజ‌కీయ ప్రాధాన్యం లేద‌ని ఆ త‌ర్వాత ల‌గ‌డ‌పాటి చెప్పినా... ఆ మాట‌ను విశ్వ‌సించిన వారు దాదాపుగా లేర‌నే చెప్పాలి. అలాంటి వారి భావ‌న‌ను నిజం చేస్తూ కాసేప‌టి క్రితం ల‌గ‌డ‌పాటి న‌వ్యాంధ్ర నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌రిధిలోని వెల‌గ‌పూడి స‌చివాల‌యంలో సీఎం చంద్ర‌బాబుతో భేటీ అయ్యారు. ఏమాత్రం ముంద‌స్తు స‌మాచారం లేకుండానే సెక్ర‌టేరియ‌ట్‌ కు వ‌చ్చిన ల‌గ‌డ‌పాటి నేరుగా సీఎం చంద్ర‌బాబు ఛాంబ‌ర్‌ కు వెళ్లారు. అక్క‌డ చంద్ర‌బాబుతో చాలా సేపే చ‌ర్చ‌లు జ‌రిపారు. ఆ త‌ర్వాత బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆయ‌న మ‌రింత క‌ల‌క‌లం రేపుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మునుప‌టి భేటీలాగే ఈ భేటీలోనూ ఎలాంటి రాజ‌కీయ అంశాలు ప్ర‌స్తావ‌న‌కు రాలేద‌ని చెప్పిన ల‌గ‌డ‌పాటి... బాబుతో త‌న భేటీలో రాజ‌కీయ ప్రాధాన్యం లేద‌ని తేల్చేశారు.

అంతేకాకుండా... రాజ‌కీయ ప్రాధాన్యం లేకుంటే బాబుతో ఎందుకు భేటీ అయ్యార‌న్న మీడియా ప్ర‌శ్న‌కు చాలా వేగంగా స్పందించిన లగ‌డ‌పాటి... *బాబు ర‌మ్మ‌న్నారు... నేను వ‌చ్చాను* అంటూ స‌మాధానం చెప్పారు. అంత‌టితో ఆగ‌ని ఆయ‌న మీడియా అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స్పందిస్తూ నంద్యాల ఉప ఎన్నిక‌ల త‌ర్వాత తాను ఎలాంటి స‌ర్వే చేయించ‌లేద‌ని కూడా తేల్చిపారేశారు. అంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ త‌మ‌కే విజ‌యావ‌కాశాలున్నాయ‌ని టీడీపీ చెబుతున్న‌ట్లుగా జ‌రుగుతున్న ప్ర‌చారంలో ఏమాత్రం నిజం లేద‌న్న మాట‌. మ‌రి ఇదే మాట‌ను ల‌గ‌డ‌పాటి స్ప‌ష్టం చేయ‌కుండానే అక్క‌డి నుంచి నిష్క్ర‌మించార‌ట‌.
Tags:    

Similar News