మ‌హిళా జ‌ర్న‌లిస్టుల‌కూ త‌ప్ప‌ని వివ‌క్ష‌!

Update: 2018-05-03 14:50 GMT
కొద్ది రోజుల క్రితం ఓ మహిళా విలేఖరి చెంప‌ను త‌మిళ‌నాడు రాష్ట్ర గవర్నర్ అస‌భ్యక‌ర‌రీతిలో తాకడం పెనుదుమారం రేపిన సంగ‌తి తెలిసిందే. లైంగిక వేధింపుల ఆరోపణలపై జరిగిన విలేఖరుల సమావేశంలో ‘ది వీక్‌’ వారపత్రిక విలేఖరి అయిన శ్రీమతి లక్ష్మీ సుబ్రమణియన్ కు అవ‌మానం జ‌ర‌గ‌డం...అదీ గ‌వ‌ర్న‌ర్ హోదాలో ఉన్న బ‌న్వ‌రీలాల్ పురోహిత్ దానికి బాధ్యుడు కావ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. దీంతో, ల‌క్ష్మికి పురోహిత్ లిఖితపూర్వక క్షమాపణ చెప్పారు. అయితే, ఈ ఒక్క ఘ‌ట‌నే కాద‌ని....మ‌హిళ‌ల ప‌ట్ల వివ‌క్ష చాలా చోట్ల ఉంద‌ని ఆమె తెలిపింది. మీడియాలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వివక్ష గురించి ఆమె అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించింది. ‘ప్రపంచ పత్రికాస్వేచ్ఛా దినోత్సవం’ సందర్భంగా....ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో ఆమె త‌న మ‌నోగ‌తాన్ని వివ‌రించింది. మ‌హిళ‌ల‌కు సంబంధించిన విష‌యాల గురించి రాసేవారే మ‌హిళా జ‌ర్న‌లిస్టుల‌నే ఫీలింగ్ కొన్నేళ్ళ క్రితం వరకు ఉండేద‌ని...కాల‌క్ర‌మంలో పొలిటిక‌ల్ రిపోర్ట‌ర్ లుగా కూడా మహిళలు...పురుషుల కంటే మెరుగ్గానే రాణిస్తున్నార‌ని ల‌క్ష్మీ సుబ్ర‌మ‌ణియ‌న్ తెలిపారు.

అయిన‌ప్పటికీ,  మీడియా సంస్థల్లోనూ, బయట కూడా ...లింగ భేదం చూపుతున్నార‌ని తెలిపారు. మనం కలసి చాలా కాలమైంద‌ని, ఇపుడు లావయ్యావ‌ని అన్నాడి.ఎం.కె.కు చెందిన ఓ మంత్రి త‌న‌తో అస‌భ్యంగా మాట్లాడార‌ని చెప్పారు. త‌న ఒంటి గురించి మాట్లాడే హ‌క్కు లేద‌ని ఆయ‌న‌తో చెప్ప‌గానే.....సైలెంట్ అయ్యార‌ని,  ఆ ఘ‌ట‌న తర్వాత‌ ఇప్పటి వ‌ర‌కు త‌న‌తో ఆయ‌న మాట్లాడ‌లేద‌ని చెప్పారు. తాజాగా డి.ఎం.కె.లో ఉదయనిధి స్టాలిన్‌ కు పెద్ద హోదా ఇవ్వడంపై ట్విట్టర్ లో కామెంట్‌ చేశాన‌ని, అప్ప‌టినుంచి త‌న‌ను ఆ పార్టీ వాళ్లు ట్రోల్ చేస్తున్నార‌ని చెప్పారు. గవర్నర్‌ ఘటన తర్వాత తన‌ ఫేస్‌ బుక్‌ ఖాతాను కొంద‌రు బీజేపీ మ‌ద్ద‌తుదారులు స్పామ్‌ అని రిపోర్ట్‌ చేశార‌ని, ఓ నకిలీ ఖాతా సృష్టించి ఫోటోలన్నిటినీ మార్ఫింగ్‌ చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మహిళా జర్నలిస్టులను కించపరుస్తూ బీజేపీలో ఉన్న ప్రముఖ నటుడు ఎస్వీ శేఖర్ ఓ నీచమైన పోస్ట్ ను ఫేస్ బుక్ లో షేర్‌ చేశారని బాధ‌ప‌డ్డారు. భ‌ర‌త‌మాత‌ను గౌర‌విస్తున్నామ‌ని చెప్పుకునే దేశంలో ఇటువంటి స్త్రీ ద్వేషం - లైంగిక వివక్ష చూసినప్పుడల్లా ఒక మహిళా జర్నలిస్టుగా త‌న‌కెంతో బాధగా అనిపిస్తుంటుందని ఆమె చెప్పారు.
Tags:    

Similar News