బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోరు రోజురోజుకీ వేడెక్కుతోంది. సభలు - సమావేశాలు - విలేకరుల సమావేశాల్లో మాటలు విసురుకోవడాలు - ఆరోపణలు - విమర్శలు చేసుకోవడాలను దాటి ఈ వేడి పెరిగింది. డిజిటల్ ఇండియా అంటున్న మోడీని అదే డిజిటల్ స్టైల్ లో దూసుకెళ్తూ దెబ్బకొడుతున్నారు బీహార్ మాజీ సీఎం - ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్. ఆయన మోడీపై విమర్శల కోసం.. మోడీని టీజ్ చేయడం కోసం డబ్ స్మాష్ ను ఉపయోగించుకున్నారు. కామెడీగా కౌంటర్లు వేయడంలో లాలూకు తిరుగులేకపోయినప్పటికీ ఆయన లేటెస్ట్ టెక్నాలజీ - యాప్స్ ను కూడా అందుకు ఉపయోగించుకుంటున్నారు. డబ్ స్మాష్ లో ఓ వీడియో రూపొందించి మోడీని టార్గెట్ చేశారు. దీన్ని ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు కూడా.
అయిదు విడతల్లో జరుగుతున్న బీహార్ ఎన్నికల్లో మొదటి విడత పోలింగ్ మరో వారం రోజుల్లో(అక్టోబరు 12న) జరగబోతోంది. దీనికోసం మోడీ - లాలూ - నితీశ్ ల మధ్య తీవ్ర పోరు జరుగుతున్న విషయం తెలిసిందే. బీహార్ కు భారీగా వరాలు ఇచ్చి బీజేపీకి అంతా అనుకూలంగా మారుస్తున్న మోడీ - లాలూ - నితీశ్ లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. దీంతో వారు అన్ని రకాలుగా మోడీని బద్నాం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
అయితే... లాలూ ఇలా డబ్ స్మాష్ లో వీడియో రూపొందించి పోస్ట్ చేయడంపై బీహారీలు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. లాలూకు ఇదంతా అవసరం లేదని... ఆయన సహజంగానే మంచి చతురుడని... ఆయన మాటల్లోనే కామెడీ ఉంటుందని అంటుండగా ఇంకొందరు మాత్రం లాలూ పెద్ద జోకర్... బీహార్ రాజకీయాల్లో ఇక పని జోకర్ గా ఉండడమేనని అంటున్నారు.