భయం తెలియని స్వాములోరు ముచ్చింతలో మీడియా మీట్ పెట్టలేదేం?

Update: 2022-03-19 08:30 GMT
మాట ఎంత విలువైనది.. మరెంత క్లిష్టమైనదన్నది కొన్ని సందర్భాల్లో తెలుస్తుంది. లాగి పెట్టి ఒకటిచ్చినా.. దానికి బదులుగా నోటి నుంచి వచ్చే క్షమాపణలు ఆ దెబ్బ తాలుకూ బాధను మరిపించేలా చేస్తాయి. కానీ.. అదే నోటి నుంచి వచ్చే మాట మాత్రం.. ముల్లు మాదిరి గుచ్చుతూనే ఉంటుంది. అదే మాటకున్న మహత్యం. అప్పుడెప్పుడో కొన్నేళ్ల క్రితం (దాదాపు 20 ఏళ్ల క్రితం) ఒక టీవీ చానల్ లో ప్రసంగించే సమయంలో ఆయన నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద రగడనే క్రియేట్ చేశాయి. తెలంగాణ ప్రజలు ఎంతో భక్తిభావంతో కొలిచే గ్రామదేవతలు సమ్మక్క.. సారలమ్మల గురించి చిన జీయర్ నోటి నుంచి వచ్చిన మాటలు చాలామందికి షాకింగ్ గా మారాయి.

ఈ వ్యాఖ్యల మంటలు రాజుకోవటం దావాగ్నిలా మారటమే కాదు.. వాటిని ఆపకపోతే విషయం ఎక్కడికో వెళ్లేలా ఉందన్న విషయాన్ని గ్రహించిన చినజీయర్ స్వామి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే.. ప్రెస్ మీట్ ను హైదరాబాద్ శివారులోని తన ఆశ్రమం ఉన్న ముచ్చింతలలో కాకుండా విజయవాడలో నిర్వహించటం గమనార్హం. వివాదం.. దానికి సంబంధించిన తీవ్రత విజయవాడలో ఉన్న మీడియా ప్రతినిధులకు తెలీదనే చెప్పాలి. అలాంటప్పుడు వివరణను విజయవాడకు వెళ్లి చెప్పిన తీరు చూస్తే.. జీయర్ స్వామికున్న ఇబ్బందులు ఏమిటో ఇట్టే అర్థమవుతాయి.

తన మీడియా సమావేశంలో తాను దడుస్తూ మూలన నక్కి మాట్లాడటం తన చరిత్రలో లేదని గొప్పలు చెప్పుకున్న చినజీయర్ స్వామి.. అదే నిజమైతే ముచ్చింతలలో మీడియా సమావేశాన్ని ఎందుకు పెట్టలేదని ప్రశ్నిస్తున్నారు. తాను బెజవాడలో ఉండటంతో అక్కడి నుంచి వివరణ ఇచ్చానన్న మాటను స్వాములోరు చెప్పొచ్చు. ఒకవేళ అదే నిజమైతే.. శంషాబాద్ లోని తన ఆశ్రమంలో మరోసారి వివరణ ఇచ్చే సాహసం చేయగలరా? అని ప్రశ్నిస్తున్నారు.

ఎవరెన్ని చెప్పినా.. ఈ వివాదం చినజీయర్ స్వామిని ఇరుకున పడేసినట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే సీఎంతో పెరిగిన దూరాన్ని జీర్ణించుకోలేని ఆయనకు సమ్మక్క.. సారలమ్మలపై చేసిన వ్యాఖ్యల వివాదం ఆయన్ను ఆత్మరక్షణలో పడేసినట్లుగా చెబుతున్నారు. ముచ్చింతల్ లో జరగాల్సిన ప్రెస్ మీట్ విజయవాడకు మారిందంటేనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చంటున్నారు. ఏమైనా.. కాలం ఖర్మం కలిసి వస్తున్న పరిస్థితి లేనప్పుడు మాట్లాడే మాటలైనా ఆచితూచి అన్నట్లు మాట్లాడితే బాగుంటుంది కదా స్వామీజీ?
Tags:    

Similar News