ఆవిర్భావ సభతో పవన్ చరిత్రను క్రియేట్ చేశారట

Update: 2022-03-16 04:52 GMT
అనుకున్నట్లే జనసేన ఆవిర్భావ సభ భారీ సక్సెస్ కావటం తెలిసిందే. పైసలు లేకుండా బహిరంగ సభలకు వచ్చే రోజులు పోయి చాలా కాలమే అయ్యింది. అలాంటిది.. ఎలాంటి తాయిలంఇవ్వనప్పటికి.. వేలాదిగా వచ్చిన జన సందోహాన్ని చూసినోళ్లంతా అవాక్కు అయిన పరిస్థితి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఇమేజ్ ఒక్క పవన్ కు మాత్రమేనని చెబుతున్నారు. కనీసం వాహనాల్ని సైతం ఏర్పాటు చేయకుండానే.. తమకు తాముగా సభకు హాజరైన పవన్ అభిమానుల్ని చూసినోళ్లకు.. రాజకీయాల్లో సరికొత్త చరిత్రను పవన్ క్రియేట్ చేస్తున్నారన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు ఏర్పాటు చేసే బహిరంగ సభలకు భారీ హాజరు ఉండేందుకు వీలుగా పెద్ద ఎత్తున తరలింపు కార్యక్రమాన్ని చేపట్టటం.. అందుకోసంకోట్లాది రూపాయిలు ఖర్చు చేయటమే కాదు.. అందుకు సమర్థులైన నేతల్ని ప్రత్యేకంగా ఎంపిక చేసి.. వారికి ఆ బాధ్యతను అప్పజెప్పటం చూస్తుంటాం. అందుకు భిన్నంగా జనసేన ఆవిర్భావ సభకు మాత్రం అలాంటి ఏర్పాట్లు చేయకుండానే జనం విరగబడటం చూస్తే.. పవన్ క్రేజ్ ఎంతన్న విషయం ఇట్టే అర్థమవుతుందని చెబుతున్నారు.

ఎలా అయితే.. టీఆర్ఎస్ ను ఉద్యమపార్టీ నుంచి రాజకీయ పార్టీగా మారినట్లుగా చెప్పిన గులాబీ బాస్ కేసీఆర్.. అందుకు తగ్గట్లు.. పొలిటికల్ పార్టీకి ఉండే అడ్వాంటేజ్ లను తీసుకున్నారని చెప్పాలి. కానీ.. పవన్ కల్యాణ్ మాత్రం అలాంటి వాటి జోలికి పోవటం లేదు. మిగిలిన రాజకీయ పార్టీలకు.. జనసేనకు ఉన్న వ్యత్యాసం ఏమంటే.. సైద్దాంతిక భావాల్ని మాటల్లోనే కాదు చేతల్లోనూ చూపించటం. ఆ మాటకు వస్తే.. మాటల కంటే కూడా చేతల్లోనే ఎక్కువగా చూపించటం ఆ పార్టీకి ఇబ్బందిగా మారిందని చెప్పాలి.

ఎందుకంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలన్ని కూడా.. ఆదర్శాల గురించి మాట్లాడటమే తప్పించి అమలు విషయాన్ని అస్సలు పట్టించుకోని తీరు కనిపిస్తుంది. అందుకు భిన్నంగా పవన్ మాత్రం.. తాను చెప్పే మాటల్ని తూచా తప్పకుండా పాటిస్తుంటారు. ఎక్కడిదాకానో ఎందుకు? తాను పోటీ చేసిన నియోజకవర్గంలో ఏ ఓటర్ ను డబ్బులతోనూ.. మద్యం బాటిళ్లతోనూ మభ్య పెట్టకుండా ఓట్లు అడగటం తెలిసిందే. దీంతో తుది ఫలితం ఎలా వచ్చిందో అందరికి తెలిసిందే.

తాజా ఆవిర్భావ సభను తీసుకుంటే.. ఇంత పెద్ద ఎత్తున సభను నిర్వహించాలంటే కనీసం రూ.10 - 15 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంతే కాదు.. జనసమీకరణ కోసం పేరున్న నేతలు చెమటలు కక్కితే కానీ జనం రాని పరిస్థితి. జనసేన విషయానికి వస్తే.. పవన్.. నాదెండ్ల మనోహర్ ఇద్దరు మినహాయిస్తే.. పార్టీకి సంబంధించిన పెద్ద తలకాయల పేర్లు పట్టుమని పది మంది పేర్లు చెప్పలేని పరిస్థితి.

ఇలాంటి పరిస్థితుల్లో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయటం.. దానికి ఎంతలా జనం పోటెత్తారో చూసిన వారంతా పవన్ హిస్టరీ క్రియేట్ చేశారన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఒకే ఒక్క ఎమ్మెల్యే.. అది కూడా పార్టీ అధినేత పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ఓడిన పార్టీకి సంబంధించిన ఆవిర్భావ సభకు.. పైసా ఖర్చు చేయకుండానే ఇంతలా అభిమానులు తరలిరావటం ఒక్క పవన్ కు మాత్రమే సాధ్యమని చెబుతున్నారు. ఏ విధంగా చూసినా..జనసేన ఆవిర్భావ సభ చరిత్రను క్రియేట్ చేసిందన్న మాటను పవన్ రాజకీయ ప్రత్యర్థులు సైతం ఒప్పుకోవటం అన్నింటికంటే పెద్ద విజయంగా చెప్పక తప్పదు.
Tags:    

Similar News