పలాస తీరం : అల్లుడు తగ్గితే అక్క నెగ్గుతుంది?

Update: 2022-02-21 13:30 GMT
శ్రీ‌కాకుళం జిల్లా, ప‌లాస రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకోనున్నాయి. అల్లుడు త‌గ్గితే అంటే వెంక‌న్న చౌద‌రి (ఇక్క‌డి టీడీపీ లీడ‌ర్) త‌గ్గితేనే అక్క శిరీష (గౌతు శ్యామ సుంద‌ర శివాజీ కుమార్తె, జిల్లా టీడీపీ మాజీ అధ్య‌క్షురాలు) నెగ్గుతారు అన్న వాద‌న ఒక‌టి వినిపిస్తోంది. 2014లో అల్లుడు వెంక‌న్న చౌద‌రి రియ‌ల్ ఎస్టేట్ వ్య‌వ‌హారాల్లోనూ ఇంకా అనేక ఆర్థిక లావాదేవీల్లోనూ అతిగా చొర‌బ‌డి  మామ (అప్ప‌టి సిట్టింగ్ ఎమ్మెల్యే గౌతు శ్యామ సుంద‌ర శివాజీ) ప‌రువు తీశాడ‌ని క‌థ‌నాలు వివిధ ప‌త్రిక‌ల్లో వ‌చ్చాయి.

 తరువాత 2019లో శివాజీ త‌ర‌ఫున ఆయ‌న కుమార్తె శిరీష సీన్ లోకి వ‌చ్చారు. ఆమె పోటీ చేశారు కానీ ఓడిపోయారు. ఆ ఎన్నిక‌ల్లో సీదిరి అప్ప‌ల్రాజు గెలిచారు. అనూహ్య రీతిలో మంత్రి అయ్యారు. ఇప్పుడు ప‌లు వివాదాల‌కు కేంద్ర బిందువు కూడా అవుతున్నారు.

ఇక సీదిరి అప్ప‌ల్రాజు వ‌ర్గానికి, శిరీష వ‌ర్గానికి చాలా కాలం సోష‌ల్ మీడియాలో పెద్ద యుద్ధ‌మే న‌డిచింది.ముఖ్యంగా వ్య‌క్తిగ‌త ఆరోప‌ణ‌లు,దూష‌ణ‌లు అన్న‌వి ఇరు వ‌ర్గాల‌కూ చెందిన ప్ర‌తినిధులు స్థాయి మ‌రిచి చేశారు.దీంతో శిరీష పెద్ద పోరాట‌మే చేశారు. కొంత మంత్రి కూడా త‌గ్గారు.కానీ త‌రువాత ప‌రిణామాల నేప‌థ్యంలో శిరీష త‌న హ‌వాను పెంచుకోలేక‌పోయారు.పెద్ద‌గా ప్ర‌జా పోరాటాలు ఏవీ చేయ‌లేదు.ముఖ్యంగా ప‌లాస మ‌త్స్య‌కార కుటుంబాల‌ను క‌లుపుకుని పోయి,వారి స‌మ‌స్య‌ల‌పై ఆమె గ‌ళం వినిపిస్తే మ‌రింత క్రేజ్ వ‌చ్చి ఉండేది కానీ ఆమె ఆ ప‌ని చేయ‌లేదు.

అదేవిధంగా మ‌త్స్యకారుల‌కు ఎంత‌గానో ఉపయోగ‌ప‌డే భావ‌నపాడు ఫిషింగ్ హార్బ‌ర్ ప‌నులు నిలిచిపోయాయి. వాటిపై కూడా పెద్ద‌గా మాట్లాడ‌లేదు. ఇంకా అనేక జిల్లా స‌మ‌స్య‌ల‌పై స్పందించాల్సి ఉన్నా కూడా ఆమె మాట్లాడ‌లేదు. దీంతో గౌతు వారింటి క్రేజ్ త‌గ్గిపోయింది.ఇదే త‌రుణంలో మంత్రి సీదిరి  దూసుకుపోతున్నారు.

మంత్రి సీదిరి త‌ప్పుల‌ను సైతం వెలుగులోకి తెచ్చే ప్ర‌య‌త్నం శిరీష చేయ‌డం లేదు. అంతేకాదు ఇప్ప‌టికీ ఆ ఇంట అల్లుడి మాటే నెగ్గుతుండ‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ తెచ్చుకున్నా గెలుపు క‌ష్ట‌మే! అన్న‌ది ఓ నిర్థార‌ణ.అయితే సీదిరి  కూడాఇదే సంద‌ర్భంలో మాట‌లు చెప్ప‌డం త‌ప్ప పెద్ద‌గా ప‌నులు చేయించిన దాఖ‌లాలు లేవు. కిడ్నీ బాధితుల కోసం ముఖ్య‌మంత్రి మంజూరు చేసిన మ‌ల్టీ స్పెషాలిటీ హాస్పిట‌ల్ నిర్మాణ‌పు ప‌నులు ఆగిపోయాక ఆయ‌న పెద్ద‌గా స్పందించ‌లేదు.

పోనీ దీనిపై టీడీపీ త‌ర‌ఫున శివాజీ కూతురు శిరీష మాట్లాడారా అంటే అదీ లేదు. సో..ప‌లాస ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో రెండు పార్టీలూ దొందూ దొందే! ముఖ్యంగా ఇక్క‌డ సూది కొండ ఆక్ర‌మ‌ణ‌ల‌పై మొన్న‌టి వేళ మున్సిప‌ల్ కౌన్సిల్ ద‌ద్ద‌రిల్లిపోయింది.

పాల‌క ప‌క్షంకు చెందిన కౌన్సిల‌ర్లే చైర్మ‌న్ ను నిల‌దీసి వెంట‌నే సంబంధిత చ‌ట్ట విరుద్ధ చ‌ర్య‌ల‌ను నిలుపుద‌ల చేయాల‌ని ఓ కౌన్సిల‌ర్ స్థాయి వ్య‌క్తి త‌న‌దైన శైలిలో మాట‌ల‌తో విరుచుకుప‌డి బైఠాయించారు.ఆ పాటి కూడా శిరీష మాట్లాడడం లేదు అంటే అక్క‌డ తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్ర‌జా పోరు ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు.

    

Tags:    

Similar News