కడపలో మొత్తం టాపిక్ ఇదేనా... ?

Update: 2022-02-15 10:30 GMT
కడపలో ఇపుడు ఒక హాట్ హాట్ టాపిక్ మీదనే చర్చ సాగుతోంది. కడప అనగానే అందరికీ గుర్తుకు వచ్చే పేరు, రాజకీయ కుటుంబం వైఎస్సార్ ది. దాదాపుగా అర్ధ శతాబ్దం పాటు ప్రజలతో అన్ని రకాలుగా పెనవేసుకుపోయిన వైఎస్సార్ కుటుంబాన్ని కడప వాసులు తమ సొంత ఫ్యామిలీగా భావిస్తారు. ఆ కుటుంబం నుంచి వచ్చిన వారిని అక్కున చేర్చుకున్నారు. అక్కడ ప్రస్తుతం హాట్ టాపికి ఏంటి అంటే మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మీద చర్చ. సీబీఐ లేటెస్ట్ గా దాఖలు చేసిన చార్జిషీట్ లోని అంశాల మీద చర్చ అయితే జోరుగా సాగుతోంది..

ఇక కడప జిల్లాను చూస్తే నాడు వైఎస్సార్ సీఎం అయినా నేడు జగన్ ముఖ్యమంత్రి అయినా అవి నిండుగా కడప జిల్లా ప్రజలు ఇచ్చిన దీవెనలే. ఇక వైఎస్సార్ తరువాత ఆయన తమ్ముడుగా లక్ష్మణుడిగా అజాత శతృవుగా వైఎస్ వివేకానందరెడ్డి ఉన్నారు. ఆయన కూడా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు. ఆయన పులివెందుల ఎమ్మెల్యేగా, కడప ఎంపీగా, మంత్రిగా పనిచేశారు.

పులివెందులలో అందరికీ పెద్దాయనగా వివేకా చాలా బాగా పరిచయం. అటువంటి వివేకానందరెడ్డి సరిగ్గా మూడేళ్ల క్రితం మార్చి 15న దారుణ హత్యకు గురి అయ్యారు. రాత్రి పది వరకూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన తెల్లారేసరికి బాత్ రూమ్ లో శవమై తేలారు. నాడు ఈ హత్య సృష్టించిన  కలకలం అంతా ఇంతా కాదు. ఆనాడు అధికారంలో ఉన్న టీడీపీ సర్కార్ మీదనే అన్ని వేళ్ళూ చూపించాయి.

జగన్ సైతం చంద్రబాబు మీదనే తీవ్ర ఆరోపణలు చేశారు. గవర్నర్ ని కలసి మరీ వివేకానందరెడ్డి హత్య విషయాన్ని తేల్చాలని డిమాండ్ చేశారు. ఆ మీదట హై కోర్టులో కూడా వివేకా కుటుంబ సభ్యుల చేత పిటిషన్ వేయించారు. ఇక తరువాత రోజుల్లో ఆ పిటిషన్ని వెనక్కి తీసుకున్నారు. అది వేరే సంగతి. మొత్తానికి చూస్తే వైఎస్సార్ హత్య జరిగింది. నిందితులు ఎవరో తెలియదు. బాబాయ్ హత్య జరిగిన కొద్ది నెలల్లోనే జగన్ సీఎం అయ్యారు.

మరి ఎంత చురుకుగా కేసు పరుగులు తీస్తుందో అనుకున్నారు కానీ అలా జరగలేదు. వివేకా కుమార్తె సునీత  రంగంలోకి దిగి ఎంతో పోరాటం చేశారు. దాంతో హై కోర్టు ఆదేశంతో సీబీఐ ఈ కేసు విచారణను చేపట్టింది. నాటి నుంచి ఈ కేసు విచారణలో ఆసక్తికరమైన విషయాలే వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో గత ఏడాది అక్టోబరు 10న తొలి చార్జిషీటు, గతనెల 31వ తేదీన మరో నివేదికను కోర్టుకు సమర్పించింది. దీని ప్రకారం చూస్తే ఎన్నో విషయాలు బయటపడుతున్నాయి.

వివేకాను ఎవరు హత్య చేశారు అన్న దాని మీద ఇప్పటికే తెలుగుదేశం సహా విపక్షాలు రాజకీయపరంగా విమర్శలు ఘటుగా విమర్శలు చేస్తున్నాయి.   అది సొంత తగాదాల వల్ల దగ్గరి వారే హత్య చేశారు అని కూడా ఆరోపిస్తూ వస్తున్నాయి. ఇక సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటులో చూస్తే పక్కా ప్రణాళిక ప్రకారమే వివేకా హత్య జరిగినట్లు సీబీఐ స్పష్టం చేసింది. ఆయనకు బాగా సన్నిహితులు, పరిచయస్తులైన ఎర్ర గంగిరెడ్డి, యాదాటి సునీల్‌యాదవ్‌, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, డ్రైవర్‌ షేక్‌ దస్తగిరి ఈ కుట్ర పన్నినట్లు తెలిపింది. 2019 మార్చి 10 గంగిరెడ్డి నివాసంలోనే వివేకా హత్యకు ప్రణాళిక రచించినట్లు వెల్లడించింది. ఇందుకు 40 కోట్ల రూపాయలకు  డీల్‌ జరిగిందని కేంద్ర దర్యాప్తు సంస్థ వెల్లడించింది.

ఇవన్నీ కూడా సంచలనానికి దారి తీసే విషయాలుగా ఉన్నాయి. శంకర్ రెడ్డి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి. అంతే కాదు ఆయనకు కడప జిల్లాలో వైసీపీ ప్రముఖులతో సంబంధాలు ఉన్నాయి. మరో వైపు వివేకా హత్య కేసులో సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటు మీద కడప జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

ఈ కేసులో నిందితులుగా ఉన్న వారితో పాటు తెర వెనక కూడా పెద్దలు ఉన్నారని సీబీఐ అనుమానిస్తోంది. అదే విధంగా కడప ఎంపీగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి మీద అనుమానం అంటూ ఈ చార్జిషీట్ దాఖలు చేయడమే ఇపుడు సంచలనం రేపుతోంది. అవినాష్ రెడ్డి జగన్ కి వరసకు సోదరుడు అవుతారు.

అదే విధంగా ఈ కేసులో ఏమైనా ముందుకు జరిగితే విచారణ ఎలా ఉంటుంది అన్నది కూడా ఆసక్తికరంగా  మారింది. ఈ నేపధ్యంలో అధికార  వైసీపీకి అటూ ఇటూగా ఈ కేసు వల్ల ఇబ్బందులు ఏమైనా వస్తాయా అన్న చర్చ అయితే సాగుతోంది. మొత్తానికి చూస్తే ఎంపీ అవినాష్ రెడ్డి విషయంలో  అయితే సీబీఐ  అనుమానం అని మాత్రమే పేర్కొనడంతో రానున్న రోజుల్లో ఇది రాజకీయంగా ఏమైనా ప్రకంపనలు సృష్టించే అవకాశాలు ఉన్నాయా అన్నదే చర్చగా ఉంది.

ఇక కడప జిల్లా వాసుల్లో ఇదే ఇపుడు పెద్ద ఎత్తున చర్చకు వస్తోంది. పెద్ద కుటుంబం, రాజకీయ కుటుంబం, ప్రస్తుతం ఆ ఫ్యామిలీ నుంచే జగన్ సీఎం గా ఉన్నారు. అలాంటి కుటుంబానికి చెందిన వైఎస్ వివేకా హత్య జరగడంతో దాని నిజానిజాలు ఏంటి అని  తెలుసుకోవాలన్న ఆసక్తి  కడప జిల్లా వాసుల్లో  అయితే కనిపిస్తోంది. మరి చూడాలి ప్రస్తుతానికి సీబీఐ చార్జిషీట్ ఒక రకంగా ఏపీ రాజకీయాలో వేడి రాజేసింది. ముందు ముందు మరెన్ని  విశేషాలు చోటు చేసుకుంటాయో.

Tags:    

Similar News