కాంగ్రెస్‌ను కాంగ్రెస్ ఓడ‌గొట్టిందా?

Update: 2022-03-14 09:24 GMT
ప్ర‌జాస్వామ్య దేశ‌మైనా భార‌త్‌లో.. కాంగ్రెస్ అధిష్ఠానం రాచ‌రిక వ్య‌వ‌స్థ‌ను కొన‌సాగిస్తుందా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ హైక‌మాండే ఓడ‌గొడుతుందా? అంటే రాజ‌కీయ ప‌రిశీల‌కులు అవున‌నే చెబుతున్నారు. పార్టీలోని అంత‌ర్గ‌త విభేదాలు ఓ వైపు దెబ్బ కొడుతుంటే.. ఇత‌ర నాయ‌కుల‌ను ఎద‌గ‌నివ్వ‌ని అధిష్ఠానం వైఖ‌రి పార్టీని పాతాళంలోకి నెట్టేస్తుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

వ‌రుస‌గా ఓట‌మి దెబ్బ‌లు ప‌డుతున్నా ఇదే ప‌ద్ధ‌తి కొన‌సాగిస్తున్నా కాంగ్రెస్ అగ్ర‌నాయ‌క‌త్వం దెబ్బ‌కు పార్టీ భ‌విష్య‌త్ ఆగ‌మ్య గోచ‌రంగా మారింది. ప్ర‌స్తుతం దేశంలో బీజేపీకి వ్య‌తిరేకంగా కార్య‌క‌ర్త‌ల బ‌లం ఉన్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్‌. దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌కు క్యాడ‌ర్ బ‌లం ఉంది.

కానీ నాయ‌కులే ఒక‌రికొక‌రు పొడుచుకుంటూ పార్టీని ప్ర‌మాదంలోకి నెడుతున్నార‌ని ఆ పార్టీ కిందిస్థాయి వ‌ర్గాల నుంచి ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

దివంగ‌త నేత ఇందిరా గాంధీ పీఎంగా ఉన్న‌ప్ప‌టి నుంచి కాంగ్రెస్‌లో ఇదే తీరు కొన‌సాగుతుంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. అప్ప‌టి నుంచి కాంగ్రెస్‌లో ఇత‌ర నాయ‌కులు ఎదిగే ప‌రిస్థితి లేద‌ని అంటున్నారు. తాము, త‌మ కుటుంబం త‌ప్పా మ‌రొకరిని పార్టీలో ఎద‌గ‌కుండా తొక్కేయడం కొన‌సాగుతూనే ఉంద‌నే రాజ‌కీయ నిపుణులు పేర్కొంటున్నారు. రోజులు మారుతున్నాయి కానీ పార్టీ హైక‌మాండ్ మాత్రం అస్స‌లు మార‌డం లేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

దేశ‌వ్యాప్తంగా మోడీపై వ్య‌తిరేక‌త పెరుగుతున్నా దాన్ని క్యాష్ చేసుకునేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం ముందుకు రావ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మ‌రోవైపు వివిధ రాష్ట్రాల్లో పార్టీ నేత‌ల మ‌ధ్య త‌లెత్తుతున్న ఆధిప‌త్య పోరును, అంత‌ర్గ‌త విభేదాల‌ను ప‌రిష్కరించ‌డంలో అగ్ర నాయ‌క‌త్వం విఫ‌ల‌మ‌వుతూనే ఉంది. ఇక పార్టీకి పుంజుకునే అవ‌కాశాలు ఉన్న రాష్ట్రాల్లో హైక‌మాండ్ దృష్టి పెట్ట‌డం లేదు.

తెలంగాణ‌లో క‌ష్టప‌డితే అధికార టీఆర్ఎస్‌కు ప్ర‌త్యామ్నాయంగా కాంగ్రెస్ ఎదిగే అవ‌కాశం ఉంది. కానీ ఇక్క‌డ టీపీసీసీ నేత‌లు ఏ కార్య‌క్ర‌మం చేప‌ట్టినా సోనియా, రాహుల్ గాంధీ మాత్రం రావ‌డం లేదు. ఎందుకంటే తాము ఆడించిన‌ట్లు ఆడే నాయ‌కులు మాత్ర‌మే వాళ్ల‌కు కావాలి. త‌మ రాచ‌రికాన్ని కొన‌సాగించాల‌న్న‌దే హైక‌మాండ్ ముఖ్య ఉద్దేశంగా క‌నిపిస్తోంది. పార్టీ గెల‌వ‌క‌పోయినా స‌రే కానీ త‌మ మాట మాత్ర‌మే చెల్లుబాటు కావాలి అనుకునే అహంకార ధోర‌నే పార్టీ ప‌త‌నానికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.
Tags:    

Similar News