15 సీట్లు మాత్రం ఎందుకు వదిలి పెట్టారు ?

Update: 2022-03-03 11:30 GMT
15 సీట్లు మాత్రం ఎందుకు వదిలి పెట్టారు ?
  • whatsapp icon
రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కచ్చితంగా 160 సీట్లు వస్తాయని రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు జోస్యం చెప్పారు.  టీడీపీకి 160 సీట్లు వస్తాయని అచ్చెన్న ఏ లెక్కలో చెప్పారో అర్ధం కావటం లేదు. ఇపుడు పార్టీకి ఉన్నది 23 సీట్లు. ఇందులో నలుగురు ఎంఎల్ఏలు పార్టీతో లేరు. సరే వీళ్ళ సంగతిని వదిలేస్తే అన్నీ నియోజకవర్గాలకు ఇన్ చార్జీలు కూడా లేరన్నది వాస్తవం.

పార్టీ వర్గాల సమాచారం ప్రకారమే దాదాపు 70 నియోజకవర్గాల్లో ఇన్చార్జిలు లేరు. ఎంఎల్ఏలను తీసేస్తే మిగిలిన నియోజకవర్గాల్లో ఉన్న ఇన్చార్జిలలో చాలామంది యాక్టివ్ గానే లేరు. ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గడచిన ఏడాదిన్నరగా మొత్తుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయండి, నిరసనలు చేయండని చంద్రబాబు మొత్తుకుంటున్నా చాలామంది పెద్దగా పట్టించుకోవటంలేదు.

క్షేత్రస్థాయిలో వాస్తవం ఇలాగుంటే అచ్చెన్న మాత్రం పార్టీకి 160 సీట్లు వచ్చేస్తాయని చెప్పటం పెద్ద జోకనే చెప్పాలి. నేతలను, కార్యకర్తలను ఉత్సాహ పరిచేందుకు పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని చెబితే అర్థముంది.

అంతేకానీ మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు వచ్చింది కాబట్టి రాబోయే ఎన్నికల్లో టీడీపీకి 160 వచ్చేస్తాయని చెప్పటంలో అర్ధమేలేదు. పైగా ఎన్నికలకు ఇంకా చాలా కాలం ఉందని అనుకోవద్దని హెచ్చరించారు. టీడీపీకి 160 సీట్లు వస్తాయని చెప్పిన అచ్చెన్న మిగిలిన 15 సీట్లు మాత్రం ఎందుకు వదిలేశారో ? అచ్చెన్న లెక్కలో మిగిలిన 15 సీట్లలో ఎవరు గెలుస్తారో కూడా చెబితే బాగుండేది.

ఎందుకంటే ఏ క్షణంలో అయినా ఎన్నికలు వచ్చేయట. అంటే ముందస్తు ఎన్నికల ముచ్చట అయిపోయినట్లుంది. అందుకనే ఏ క్షణంలో అయినా ఎన్నికలు వచ్చేయచ్చనే కొత్తరాగం మొదలుపెట్టారు.

ఏ క్షణంలో అయినా ఎన్నికలు వచ్చేస్తాయనేందుకు హేతువు ఏమిటో అచ్చెన్నే చెప్పాలి. నిజంగా అచ్చెన్న చెప్పినట్లు ఏ క్షణంలో అయినా ఎన్నికలు వచ్చేస్తే నష్టపోయేది టీడీపీనే. ఎందుకంటే చాలా నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులే లేరుకాబట్టి. కాబట్టి నేతలను ఉత్సాహపరిచేందుకు అచ్చెన్న కాస్త వాస్తవానికి దగ్గరగా ఉండే మాటలు చెబితే బాగుంటుంది.
Tags:    

Similar News