మడమ తిప్పటం అలవాటు లేని జగన్ కు ఎందుకీ కష్టాలు?

Update: 2021-11-23 16:30 GMT
రాజకీయ అధినేతలు ఒక్కొక్కరికి ఒక్కో మేనరిజమ్ మాత్రమే కాదు.. వారి మార్కు డైలాగ్ ఒకటి ఉంటుంది. అలాంటి మాటలు వారి నోటి నుంచి వచ్చినంతనే.. ప్రజలు కేరింతలు కొడుతుంటారు. దివంగత మహానేతలు ఎన్టీఆర్.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ఇలా ఎందరో ప్రజానేతలకు వారిదైన మార్కు డైలాగులు ఉంటాయి.

ఆరు కోట్ల ఆంధ్రులు.. నా అక్క చెల్లెళ్లు.. అన్నదమ్ములు.. అంటూ గంభీరమైన స్వరంతో ఎన్టీఆర్ నోటి నుంచి వచ్చే మాటకు రోమాలు నిక్కబొడవని తెలుగుడో ఎవరు. వైఎస్ విషయానికి వస్తే.. ఆయన వ్యక్తిత్వానికి చాలా దగ్గరగా ఉండే.. ‘మాట తప్పని.. మడమ తిప్పని కుటుంబం మాది’ అన్న మాట ఆయన నోటి నుంచి వచ్చినంతనే ఎంతలా కేరింతలు కొడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

వైఎస్ రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి.. తన తండ్రి మాటల్ని తరచూ వాడుతుంటారు. విపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన పాల్గొనే సభల్లో ఆయన నోటి వెంట తరచూ.. మాట తప్పని.. మడమ తిప్పని వంశం మాది అంటూ వ్యాఖ్యానించటం.. దానికి ప్రజల నుంచి భారీ ఎత్తున స్పందన రావటం తెలిసిందే.

మరి.. అలాంటి ఆయన తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో.. గతంలో ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పిన మాటల్ని ఇప్పుడు చెప్పగలరా? అన్నది ప్రశ్న.

ఏపీ రాజధాని అమరావతి స్థానే మూడు రాజధానులు అంటూ మార్చేసిన జగన్మోహన్ రెడ్డి.. తాజాగా మూడు రాజధానుల తీర్మానంపై వెనక్కి తగ్గి.. ఆ చట్టాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లుగా ప్రకటించటం తెలిసిందే.

ఇది చాలదన్నట్లుగా.. గతంలో తమకు సంఖ్యా బలం లేదన్న కారణంగా ఏపీ మండలిని రద్దు చేస్తూ తీర్మానం చేయటం.. అదికాస్తా సెలక్ట్ కమిటీ వద్ద ఆగటం తెలిసిందే. మూడు రాజధానుల మీద వెనక్కి తగ్గిన జగన్.. తాజాగా శాసన మండలి రద్దుకు సంబంధించిన తీర్మానాన్ని సైతం వెనక్కి తీసుకోవటం ఖాయమంటున్నారు.

ఇదంతా జరిగిన తర్వాత గతంలో మాదిరి మాట తప్పని.. మడమ తిప్పని కుటుంబం తమదన్న మాట జగన్ నోటి నుంచి వచ్చే అవకాశం లేనట్లే. తనకెంతో ఇష్టమైన ఈ డైలాగ్ ను మిస్ చేసుకుంటున్న జగన్ దాని స్థానే మరో కొత్త డైలాగ్ ను అర్జెంట్ గా వెతుక్కోవాల్సి ఉంది.


Tags:    

Similar News