ఎంపీని కాపాడుతున్నదెవరు ?

Update: 2021-07-10 08:30 GMT
'వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామకృష్ణంరాజుపై చర్యలు తీసుకునే విషయంలో లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా పక్షపాత దోరణి కనిపిస్తోంది'.. వైసీపీ రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గడచిన ఏడాదికి పైగా ఎంపిపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపిలు చాలాసార్లు స్పీకర్ ను కోరిన విషయం తెలిసిందే. అయితే ఎన్నిసార్లు పార్టీ ఎంపిలు లేఖలు రాస్తున్నా, కలిసినపుడు విజ్ఞప్తి చేస్తున్నా స్పీకర్ మాత్రం పెద్దగా పట్టించుకున్నట్లు కనబడటంలేదు.

ఒకవైపు ఎంపిపై అనర్హత వేటుకు పార్టీ ప్రయత్నిస్తుంటే మరోవైపు తనపై అనర్హత వేటు వేయద్దని రఘురామ స్పీకర్ కు విజ్ఞప్తి చేస్తున్నారు. కారణాలు ఏవైనా కానీ ఇప్పటివరకు ఎంపికి అనుకూలంగానే పరిస్ధితులు కనబడుతున్నాయి. అందుకనే వైసీపీ ఎంపిలు ఒత్తిడి పెంచారు. ఇందులో భాగంగానే స్పీకర్ ను కలిసినపుడు అనర్హత వేటు విషయంలో ఎంపికి నోటీసిచ్చి సభాహక్కుల సంఘానికి పంపిస్తామని స్పీకర్ చెప్పారట.

ఇదే విషయంపై విజయసాయి మండిపోయారు. ఎంపిపై అనర్హత వేటు విషయానికి సభాహక్కుల సంఘానికి సంబంధం ఏమిటంటు స్పీకర్ ను నిలదీశారు. అనర్హత వేటుపై 6 నెలల్లో నిర్ణయం తీసుకోవాలన్న సుప్రింకోర్టు ఆదేశాలను కూడా స్పీకర్ పట్టించుకోవటం లేదని ఆరోపించారు. స్పీకర్ గనుక వెంటనే నిర్ణయం తీసుకోకపోతే పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావిస్తామని స్పీకర్ కే చెప్పినట్లు తెలిపారు. అవసరమైతే సమావేశాలను స్తంభించటానికి కూడా పార్టీ ఎంపిలు రెడీ అవుతున్నట్లు విజయసాయి చెప్పారు.

మొత్తానికి అనర్హత వేటు అంశం కీలక మలుపు తీసుకున్నట్లే అర్ధమవుతోంది. స్పీకర్ చెప్పినట్లుగా సభాహక్కుల సంఘానికి రెఫర్ చేస్తే అక్కడేమవుతుందో ఎవరు చెప్పలేరు. బహుశా అనర్హత వేటునుండి ఎంపి తప్పించుకునే అవకాశాలు ఎక్కువున్నాయేమో. ఇంత డొంకతిరుగుడు వ్యవహారం బదులు ఎంపిపై అనర్హతవేటు వేయటం సాధ్యం కాదని కూడా స్పీకర్ చెప్పేసుండచ్చు. కానీ అలా చెప్పటంలేదు.

కారణం ఏమిటంటే నరేంద్రమోడి సర్కార్ కు రాజ్యసభలో వైసీపీ మద్దతు అవసరం. అందుకనే డొంకతిరుగుడు చేష్టలతో విషయాన్ని వీలైనంత నాన్చుతున్నట్లు అర్ధమైపోతోంది. మరి తాజా పరిణామాల్లో రాబోయే పార్లమెంటు సమావేశాలు ఇదే విషయమై వాడి వేడిగా జరిగే అవకాశం ఉంది. చూద్దాం ఏమవుతుందో.
Tags:    

Similar News