కేసీఆర్ నాన్చేలోగానే...మోదీ తేల్చేశాడుగా

Update: 2019-12-15 04:19 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తాను తీసుకున్న నిర్ణ‌యాన్ని ...గ‌త కొద్దికాలంగా చ‌ర్చ‌ల‌కు - వివాదాల వ‌ర‌కే ప‌రిమితం చేయగా...ఢిల్లీలోని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ స‌ర్కారు మాత్రం అదే త‌ర‌హాలోని ముఖ్య‌మైన అంశాన్ని ఆచ‌ర‌ణ‌లో పెట్టేసింది.

తెలంగాణలో కొత్త అసెంబ్లీ - నూతన సచివాలయం భవనాలను నిర్మించాలన్న ప్రతిపాదనలను దాదాపు రెండు సంవ‌త్స‌రాల కిందట‌ కేసీఆర్ తెరమీద‌కు తెచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే, దీన్ని తెలంగాణ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మ‌రోవైపు  ఇదే స‌మ‌యంలో ఢిల్లీలో నూతన పార్లమెంటు భవనాన్ని నిర్మించాలని కేంద్రంలో బీజేపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. తాజాగా - లోక్‌ సభ స్పీకర్‌ ఓం బిర్లా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.  పార్లమెంట్‌ సమావేశాలు 2022లో కొత్త భవనంలో నిర్వహించే అవకాశాలు ఉన్నాయని స్పీక‌ర్‌ చెప్పారు.

లోక్‌ సభ నిరవధికంగా వాయిదాపడిన అనంతరం స్పీకర్‌ ఓం బిర్లా ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘దేశంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకొంటున్న వేళ పార్లమెంట్‌ సమావేశాలను కొత్త భవనంలో నిర్వహించేలా కసరత్తు జరుగుతోంది. 2022నాటికి కొత్త భవనం అందుబాటులోకి వస్తుందనే నమ్మకం నాకు ఉంది’ అని  స్పీకర్‌ ఓం బిర్లా పేర్కొన్నారు. నూతన పార్లమెంటు భవన నిర్మాణం ఎక్కడ చేప‌డుతారని ప్రశ్నించగా.. ప్రభుత్వం దృష్టిలో రెండు మూడు ప్రాంతాలు ఉన్నాయన్నారు. అంతే త‌ప్ప ఫ‌లానా ప్రాంత‌మ‌ని  స్పీకర్‌ ఓం బిర్లా పేర్కొన‌లేదు.

మ‌రోవైపు, కొత్త భవనంలో ఎంపీలకు అత్యాధునిక సాంకేతికత - అనేక సదుపాయాలు అందుబాటులో ఉంటాయని  స్పీకర్‌ ఓం బిర్లా తెలిపారు. ఉభయ సభల్లో జరిగిన జరిగిన 1858 చర్చలు - ప్రసంగాలను డిజిటలైజ్‌ చేశామని తెలిపారు. ఇందులో బ్రిటిష్‌ హయాంలో జరిగినవి కూడా ఉన్నాయన్నారు. నూత‌న పార్ల‌మెంటు సాంకేతిక‌త‌ - భార‌తీయ‌త‌కు ప్ర‌తీక‌గా ఉంటుంద‌ని  స్పీకర్‌ ఓం బిర్లా వివ‌రించారు.



Tags:    

Similar News