బీజేపీకి నో చెప్పిన గ్లామరస్ హీరోయిన్!

Update: 2019-03-28 16:21 GMT
ఈ ఎన్నికల్లో గ్లామరస్ సెలబ్రిటీలను బరిలోకి దించాలన్న భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు  కొంత  వరకూ మాత్రమే సఫలం అవుతూ ఉన్నాయి. కొంతమంది సెలబ్రిటీలను బీజేపీ ముందు నుంచినే లక్ష్యంగా చేసుకుందని వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే సదరు సెలబ్రిటీల్లో కొందరు సై అంటూ  బీజేపీ తీర్థం పుచ్చుకొంటూ ఉండగా.. కొందరు మాత్రం నో అంటూ.. తాము పోటీకి సిద్ధంగా లేమని చెబుతూ ఉన్నారు.

ఇప్పటికే  క్రికెటర్ గౌతమ్ గంభీర్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనను కమలం పార్టీ చాన్నాళ్ల కిందటే టార్గెట్ చేసుకుంది. గంభీర్ తో పాటు సెహ్వాగ్ ను కూడా కమలం పార్టీ టార్గెట్ చేసుకుంది.  అయితే సెహ్వాగ్ విషయంలో బీజేపీ సఫలం అయినట్టుగా లేదు.

ఇక జయప్రదను కూడా బీజేపీ చేర్చుకుంది.  కానీ.. ఇంతకు ముందే కమలం పార్టీ లక్ష్యంగా చేసుకున్న మాధురీ దీక్షిత్ మాత్రం తాపీగా సారీ చెప్పేసింది. మాధురిని తమ పార్టీలోకి చేర్చుకుని పోటీ చేయించాలని బీజేపీ చాన్నాళ్లుగానే ప్రణాళికలు రచించింది.  మాధురీ ఇంటికి బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కూడా వెళ్లారు. మోడీ కార్యక్రమాలకు ప్రచారం కల్పించాలని అప్పట్లో షా ఆమెను కోరారు. అదే సమయంలో ఆమెను రాజకీయాల్లోకి రావాలని, బీజేపీలో చేరాలని కూడా షా ఆహ్వానించినట్టుగా ప్రచారం జరిగింది.

అలాంటి నేపథ్యంలో ఎన్నికల ముందు ఈ గ్లామరస్ నటీమణి కమలం పార్టీలో చేరుతుందనే ఊహాగానాలు  వినిపించాయి. ఈమె పుణె నుంచి పోటీ చేస్తుందని కూడా ప్రచారం జరిగింది. అయితే ఆ ఊహాగానాలకు తెర దించింది మాధురి. తను ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదని, అలాంటి ప్రచారాలు ఏవైనా జరుగుతున్నా అవి ఉత్తుత్తివే అని మాధురీ తేల్చి చెప్పింది. ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం - ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు ఏమీ లేదని మాధురి స్పష్టం చేసింది.
Tags:    

Similar News