మంగళసూత్రం తీసేయటంపై మద్రాస్ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు!

Update: 2022-07-15 09:30 GMT
ఎందుకు? ఏమిటి? అన్నది పక్కన పెడితే.. గతంలో మాదిరి మంగళసూత్రాన్ని ధరించేటోళ్లు తక్కువ అవుతున్నారు. గతంలో మాదిరి మంగళసూత్రాలకు బదులుగా నల్లపూసలు ధరించటం..సన్నటి చైన్ పెట్టుకొని ఆఫీసులకు వెళుతున్న వైనం ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. గతంలో మంగళసూత్రంతో పాటు నల్లపూసలు వేర్వేరుగా ధరించేవారు. ఇప్పుడు మంగళసూత్రానికి బదులుగా నల్లపూసలు ధరించే ఫ్యాషన్ పెరుగుతోంది. ఎందుకిలా? ఏమిటి? అనే దానిపై ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్టు అయ్యే పరిస్థితి.

ఇలాంటివేళ.. ఒక విడాకుల కేసు విచారణ సమయంలో మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్య.. భర్త బతికి ఉన్న వేళ మంగళసూత్రాన్ని తీసేయటంపై ఘాటుగా రియాక్టు అయ్యింది.

మంగళసూత్రాన్ని తీసేయటం మానసిక క్రూరత్వానికి నిదర్శనంగా పేర్కొన్నారు. "మంగళసూత్రం వైవాహిక జీవితానికి ప్రతీక. భర్త మరణించిన తర్వాత మాత్రమే దానిని తొలగించాలి. విడిపోవాలనుకున్న భార్య ముందుగా తాళిని తీసివేయటమంటే భర్తను మానసిక క్రూరత్వానికి గురి చేసినట్లే" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

తమిళనాడులోని ఈరోడ్ కు చెందిన శివకుమార్ తనకు విడాకులు ఇవ్వటానికి నిరాకరిస్తూ స్థానిక ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని మద్రాస్ హైకోర్టులో అప్పీల్ చేశారు. మెడికల్ కాలేజీలో పని చేసే ప్రొఫెసర్ గా పని చేసే భర్తతో విడిపోవాలని భావించిన భార్య విడాకుల కోసం దరఖాస్తు చేశారు. అయితే.. ఈ కేసు విచారణ సమయంలోనే భార్య తన తాళిని తొలగించినట్లుగా కోర్టు ముందు ఆమె అంగీకరించారు. దీంతో హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ.. వివాహ వేడుకలో తాళి కట్టటం అన్నది ముఖ్యమైన ఆచారమన్న కోర్టు.. ఆమె తీరును తప్పు పట్టింది.

ఆమె తన తాళిని తొలగించి.. బ్యాంకు లాకరులో ఉంచినట్లుగా అంగీకరించారు. ఏ హిందూ వివాహిత కూడా తన భర్త బతికి ఉన్న సమయంలోనూ.. ఏ టైంలోనూ తాళిని తీయదు. ఇది అందరికి తెలిసిన విషయమే. స్త్రీ మెడలో తాళి అనేది పవిత్రమైన అంశం.

ఇది వైవాహిక జీవితం కొనసాగింపునకు సూచిస్తుంది. భర్త మరణించిన తర్వాత మాత్రమే తొలగించాలి. భార్య తాళిని తొలగిస్తే భర్తకు మానసిక క్షోభ కలుగుతుంది' అన్న హైకోర్టు న్యాయమూర్తుల వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. మద్రాస్ హైకోర్టు తాజా వ్యాఖ్యల నేపథ్యంలో.. రానున్న రోజుల్లో మరెన్ని అంశాలు చర్చకు వస్తాయో చూడాలి.
Tags:    

Similar News