మలేసియా రాజు..ప్రేమ కోసం రాచ‌రికం వ‌దిలేశాడు

Update: 2019-01-09 01:30 GMT
అభివృద్ధి చెందిన ముస్లిం దేశాల్లో ఒక‌టైన మలేసియాలో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. గతేడాది లవ్‌ మ్యారేజ్‌ చేసుకుని సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన ఆ దేశ రాజు సుల్తాన్ ముహమ్మద్-5 తాజాగా రాచరికాన్ని త్య‌జించారు. రాచరిక నిబంధనలకు విరుద్ధంగా క్రైస్తవ మతానికి చెందిన రష్యా మాజీ బ్యూటీ క్వీన్‌ ను పెళ్లాడిన ఆయన.. కొంతకాలంగా కొనసాగుతున్న హైడ్రామాకు తెరదించారు. రాచరికాన్ని త్యజిస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ విషయాన్ని మలేసియా రాజభవనం దృవీకరించింది.

బ్రిటన్‌ తో పోరాడి స్వాతంత్రం తెచ్చుకున్న 1957 నుంచి మలేసియాలో ముస్లింలదే మెజార్టీ, వారిదే అధికారం. రెండేళ్ల క్రితం ఆ దేశపు 15వ రాజుగా పదవీ బాధ్యతలు చేపట్టారు 49 ఏళ్ల రాజు సుల్తాన్ ముహమ్మద్-5. ఆయన గతేడాది రష్యా మాజీ మిస్ మాస్కో ఒక్సానా ఓవదీనాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి కోసమే ఓవదీనా ఇస్లాం మతం స్వీకరించి రిహానాగా పేరు మార్చుకుంది. అయితే మ్యారేజ్‌ తరువాత అనారోగ్య కారణాలతో గతేడాది నవంబర్‌ నుంచి సెలవులో ఉన్నారు. ఇప్పుడు ఉన్నట్టుండి ఆయన పదవికి రాజీనామా చేశారు. పదవీకాలం ముగియకముందే రాచరికాన్ని త్యజించిన తొలి మలేసియా పాలకుడిగా నిలిచారు మహమ్మద్ సుల్తాన్‌. ఆయన నిష్క్రమణను దృవీకరించిన రాజభవనం.. అందుకు కారణమేంటో చెప్పలేదు. దీంతో సుల్తాన్‌ పదవి త్యాగం ఇప్పుడు హాట్ టాపిక్‌ గా మారింది.

ఇదిలా ఉంటే రాజ్యాంగపరంగా రాజరికం అనుసరిస్తున్న మలేసియాలో ఓ రాజకీయ ప్రత్యేకత ఉంది. ప్రతి ఐదేళ్లకోసారి రాజు మారేలా ప్రత్యేక చట్టాలు అమల్లో ఉన్నాయి. ఇందులో భాగంగా 9 రాష్ట్రాలకు చెందిన శతాబ్దాల చరిత్ర గల రాజ కుటుంబీకులకు సింహాసనం అధిష్ఠించి, పరిపాలించే అవకాశం దక్కుతుంది. అయితే ప్రస్తుత రాజు మొహమ్మద్ గద్దె దిగడంతో తదుపరి రాజసింహాసనం అధిష్ఠించేది ఎవరనే విషయంపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. తన పదవికి రాజీనామా చేసిన రాజు ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌తో ప‌ద‌వి స్వీక‌రిస్తార‌ని ప‌లువురు ఆకాంక్షిస్తున్నారు.


Full View

Tags:    

Similar News