ఏమాటకామాటే.. మమత మహా మొనగత్

Update: 2016-03-05 04:16 GMT
ఎన్నికలు వస్తున్నాయంటే రాజకీయ పార్టీలు ఆగమాగం అవుతుంటాయి. ఎక్కడి వరకో ఎందుకు.. మన తెలుగు రాష్ట్రాల విషయానికే వస్తే.. ఎన్నికల ప్రకటన వచ్చే విషయం.. షెడ్యూల్ విషయంపై అవగాహన ఉన్నా.. అభ్యర్థుల ఖరారు విషయంలో ప్రధాన రాజకీయ పక్షాలు కిందామీదా పడుతుంటాయి. చివరి నిమిషం వరకూ అభ్యర్థుల ప్రకటనలో హైడ్రామా నెలకొని ఉంటుంది. ప్రతిసారి ఎన్నికల్లో ఇదే తంతు నెలకొని ఉంటుంది.

అభ్యర్థుల ఎంపిక మీద కసరత్తు పూర్తి అయ్యిందని.. గతంలో మాదిరి చివరి నిమిషం హడావుడి ఉండదని నేతలు మాటలు చెప్పినా.. చేతల్లో అలాంటివేమీ కనిపించవు. నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసే వరకూ చర్చల మీద చర్చలు సాగుతూ.. భారీ మేథోమధనం సాగుతుంటుంది. తాజాగా.. ఐదు రాష్ట్రాలకు జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు శుక్రవారం మధ్యాహ్నం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఎన్నికల సంఘం అలా ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసిందో లేదో..ఆ వెంటనే పశ్చిమబెంగాల్ అధికారపక్షమైన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దిగే అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం విడుదల చేసిన వెంటనే.. అంతే వేగంగా అభ్యర్థుల జాబితాను ప్రకటించటం అంత సులువేమీ కాదు. అసంతృఫ్తులు.. ఆశావాహులు భారీగానే ఉంటారు. కానీ.. అలాంటి తలనొప్పులు తనకేం ఉండవన్నట్లుగా ధీమాగా అభ్యర్థుల జాబితాను విడుదల చేసే దమ్మూ.. ధైర్యం మమతా బెనర్జీకి మాత్రమే ఉందేమో. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన కాసేపటికే తమ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల చేయటం ద్వారా మమతా బెనర్జీ తానెంత మొనగత్తె అన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.
Tags:    

Similar News