కేసీఆర్.. జగన్ లకు దీదీ రాసిన లేఖలో ఏముంది?

Update: 2021-04-01 05:34 GMT
మన దాకా వస్తే కానీ తెలీదన్న సామెతకు తగ్గట్లుగా ఉంది పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీరు. తాను.. తన రాష్ట్రం తప్పించి మరేదీ పట్టనట్లుగా వ్యవహరించటం ఆమెకు అలవాటే. తన రాజకీయ ప్రయోజనాల విషయంలో ఆమె చాలా కచ్ఛితంగా ఉంటారు. మిగిలిన విషయాల సంగతి ఎలా ఉన్నా.. తనకెందుకు అన్నట్లుగా ఆమె తీరు ఉంటుంది. పలు సందర్భాల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. దీదీ వైపు చూడటం.. ఆమె పట్టనట్లుగా వ్యవహరించటం తెలిసిందే. మూడో కూటమి కోసం కేసీఆర్ ప్రయత్నాలు చేయటం.. అనంతరం చోటు చేసుకున్న ఫలితాలతో ఆయన కామ్ గా ఉన్నారు.

ప్రస్తుతం బెంగాల్ లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో దీదీ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారు. తన అడ్డాలో పాగా వేయటానికి కమలనాథుల ప్రయత్నాలు ఆమెను చిరాకు పుట్టిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో తలమునకలైన ఆమె.. బీజేపీ జోరుకు బ్రేకులు వేసేందుకు వీలుగా అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్నారు. బీజేపీని ధీటుగా ఎదర్కొని మట్టికరిపించేందుకు ఉమ్మడిగా ఉద్యమిద్దామంటూ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు.. పది మంది విపక్ష అగ్రనేతలకు లేఖ రాసిన వైనం ఆసక్తికరంగా మారింది.

ఇంతకీ ఆమె రాసిన లేఖలో ఏముంది? అన్న విషయంలోకి వెళితే.. ప్రజాస్వామ్యం పెద్ద ప్రమాదంలో పడిందని.. రాజ్యాంగంపైనా.. సమాఖ్య వ్యవస్థ మీదా బీజేపీ చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా సమైక్యంగా.. సమర్థంగా పోరాడేందుకు సమయం వచ్చేసిందని ఆమెపేర్కొన్నారు. అందరం కలిసి దేశ ప్రజలకు విశ్వసనీయ ప్రత్యామ్నాయాన్ని అందించాలని.. అందుకు కలిసి రావాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.

తాజాగా దీదీ రాసిన లేఖను చూస్తే.. బెంగాల్ ఎన్నికలు ముగిసిన తర్వాత.. జాతీయ రాజకీయాల మీద ఆమె ఫోకస్ పెట్టే అవకాశం ఉందన్నట్లుగా ఆమె తాజా వ్యాఖ్యలు ఉన్నాయి. బెంగాల్ లో దీదీ కానీ ఘన విజయం సాధిస్తే.. తదనంతర పరిణామాలు ఆసక్తికరంగా మారటం ఖాయమని చెబుతున్నారు. తాజాగా ఆమె రాసిన లేఖను చూస్తే.. కాంగ్రెష్ అధినేత సోనియా.. ముఖ్యమంత్రులు ఉద్ధవ్ ఠాక్రే.. కేసీఆర్.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. అదే సమయంలో బలమైన ప్రాంతీయ పార్టీలుగా ఉన్న స్టాలిన్.. పవార్.. అఖిలేష్ యాదవ్.. తుజస్వీ యాదవ్.. దీపాంకర్ భట్టాచార్యలు కూడా ఉన్నారు. మరి.. దీదీ రాసిన లేఖకు స్పందన ఎంతమేర ఉంటుందన్నది ఇప్పుడు క్వశ్చన్ గా మారింది. దీనికి కాలమే సరైన సమాధానం ఇస్తుందని చెప్పాలి.
Tags:    

Similar News