చంద్రబాబుకు ఊరట..లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకు బ్రేక్

Update: 2019-03-28 13:54 GMT
ఈ ఎన్నికల్లో అన్ని వైపుల నుంచి కష్టాలు ఎదుర్కొంటున్న చంద్రబాబుకు పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ చిన్నపాటి ఊరట లభించినట్లే లభించి గందరగోళంలోకి నెట్టింది. చంద్రబాబు పొలిటికల్ ఇమేజ్‌ ను భారీగా డ్యామేజ్ చేస్తుందని భావిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. పోలింగ్ తేదీలోగా విడుదల చేయడానికి వీల్లేదని ఏపీలోని మంగళగిరి న్యాయస్థానం తీర్పు చెప్పింది. దీంతో చంద్రబాబు, టీడీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. ఈ స్టే మంగళగిరి వరకు మాత్రమే వర్తిస్తుంది. ఏప్రిల్‌ 15వ తేదీ వరకూ మంగళగిరి పట్టణంలో సినిమాను విడుదల చేయొద్దంటూ ఇంజక్షన్‌ ఆర్డర్‌ జారీ చేసింది. దీంతో ఇతర ప్రాంతాల్లో విడుదల చేస్తారేమోనని టీడీపీ వర్గాలు టెన్షన్ పడుతున్నాయి. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలు, యూట్యూబ్ - ట్విట్టర్ - ఫేస్‌ బుక్‌ లలో కూడా విడుదల చేయడానికి వీల్లేదని దర్శక నిర్మాతలకు కోర్టు నోటీసులు ఇవ్వడం కొంతలో కొంత నయమంటున్నాయి టీడీపీ వర్గాలు.
   
అయితే ఇదే సినిమాపై ఏపీ హైకోర్టులోనూ కేసులు దాఖలయ్యాయి. స్టే కోరుతూ దాఖలైన ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు ఏప్రిల్‌ 3వ తేదీ వరకు ఈ సినిమాను ప్రదర్శించవద్దని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 3కు వాయిదా వేసింది. సినిమా కాపీని తమ ఛాంబర్‌కు తీసుకువస్తే న్యాయవాదుల సమక్షంలో సినిమా చూస్తామని న్యాయమూర్తి తెలిపారు.  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శిస్తూ రాంగోపాల్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారన్న ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్లగానే ఆసినిమా ట్రైలర్స్ కూడా వచ్చాయి. దీంతో ఇది రిలీజ్ అయితే ఎన్నికల వేళ తమకు భారీ నష్టం కలుగుతుందని టీడీపీ నేతలు - చంద్రబాబు ఆందోళన చెందారు. దీంతో ఇది విడుదలైతే ఎన్నికల సమయంలో టీడీపీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందంటూ... కొందరు హైకోర్టును ఆశ్రయించారు. వాదనలను విన్న హైకోర్టు ఏప్రిల్ 3కి నిర్ణయం వాయిదా వేసింది.
   
అయితే.. కోర్టు నిర్ణయం ఏపీ వరకే వర్తిస్తుందని.. తెలంగాణలో రేపు శుక్రవారం తాము సినిమాను విడుదల చేస్తామని చెబుతున్నారు చిత్ర నిర్మాతలు. అంతేకాదు.. దీనిపై సుప్రీంకోర్టుకు కూడా వెళ్లడానికి వారు సిద్ధమవుతున్నారు.
Tags:    

Similar News