కంగనకు భారీ కౌంటర్ ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి

Update: 2019-12-25 05:20 GMT
ఒక ఇమేజ్ వచ్చిన తర్వాత పబ్లిక్ లో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. సోషల్ మీడియాలో పెట్టుకునే పోస్టుల తరహాలో మాటలు అస్సలు పనికి రావు. ఒక సీరియస్ అంశం మీద మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆ అంశం మీద పూర్తి అవగాహన చాలా ముఖ్యం. లేదంటే నవ్వులపాలు కావటం ఖాయం. తాజాగా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు రీల్ క్వీన్.. రియల్ ఫైర్ బ్రాండ్ బాలీవుడ్ నటి కంగనా రౌనత్. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలకు భారీ కౌంటర్ ఇచ్చారు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా.

తనకు నచ్చిన అంశాలపై విరుచుకుపడే కంగనాకు ఢిల్లీ డిప్యూటీ సీఎం స్పందించే అంశం ఏమొచ్చింది? అన్న విషయంలోకి వెళితే.. తాజాగా ఆమె నటించిన పంగా చిత్ర ప్రమోషన్ లో పాల్గొంటున్నారు. ఈ చిత్రంలో ఆమె మధ్యతరగతి యువతి పాత్రను పోషిస్తున్నారు. జనవరి 24న రిలీజ్ కానుంది. దీనికి సంబంధించిన ట్రైలర్ ను ఇటీవలే విడుదల చేశారు. ఈ చిత్ర ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. తాజా హాట్ టాపిక్ అయిన పౌరసత్వ సవరణ చట్టం మీద మాట్లాడారు.

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనలు హింసాత్మకంగా ఉండటాన్ని ప్రస్తావిస్తూ.. నిరసనలు హద్దులు దాటొద్దని.. హింసాత్మకం కావటం వల్ల విలువైన ఆస్తులకు నష్టం వాటిల్లుతుందన్నారు. దేశంలో కేవలం మూడు.. నాలుగు శాతం మంది మాత్రమే పన్ను చెల్లిస్తున్నారని.. మిగిలిన వ్యక్తులు వీరిపైన ఆధారపడుతున్నారని వ్యాఖ్యానించారు.

పన్ను కట్టేది 3.. 4 శాతమే అయినప్పుడు బస్సుల్ని.. రైళ్లను దగ్థం చేసే హక్కు ఎవరిచ్చారు? ఓ బస్సు ధర రూ.80 లక్షలు.. అది తక్కువ మొత్తం కాదని ప్రశ్నించారు. అయితే.. ఈ వ్యాఖ్యల్లో కంగన చేసిన తప్పు ఏమైనా ఉందంటే.. పన్ను చెల్లింపు అనే అంశానికి సంబంధించి ఆదాయపన్ను అన్న మాటను చేరిస్తే తప్పు ఉండేది కాదు. ఆమెకు అవగాహన లేకనో..మరి  మర్చిపోయారో కానీ ఆ అంశాన్ని ప్రస్తావించలేదు.

బీజేపీకి అనుకూలంగా మాట్లాడే కంగన వ్యాఖ్యలపై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా రియాక్ట్ అయ్యారు. గురి చూసి కొట్టినట్లుగా కంగన తాజా వ్యాఖ్యలకు భారీ కౌంటర్ ఇచ్చారు. ఆమె మాట్లాడిన సాంకేతిక అంశానికి సంబంధించిన లోపాన్ని హైలెట్ చేసి.. డొల్లమాటలుగా తేల్చేసి కంగన గాలి తీసే ప్రయత్నం చేశారు.

నిరసనలు.. ఆందోళనలతో ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయటం.. ఆర్థికనష్టం వాటిల్లేలా చేయటం తప్పు.. చట్టవిరుద్దమేనన్న ఆయన.. ఈ దేశం మూడు శాతం మంది ప్రజలు చెల్లించే పన్నుపై ఆధారపడటం లేదన్నారు. దేశంలో ప్రతి ఒక్కరూ పన్ను కడుతున్నారని.. కూలి పని చేసే వారు కూడా పరోక్షంగా పన్నులు చెల్లిస్తున్నారన్నారు. ఉప్పులాంటి చౌక వస్తువు కొన్నా.. వాటిపై ప్రభుత్వానికి పన్ను కడుతున్నారని.. సినిమా చూడటానికి థియేటర్ కు వెళ్లినా నటీనటుల కోసం కొంత.. వినోద పన్ను రూపంలో మరికొంత చెల్లిస్తున్నారంటూ క్లారిటీ ఇచ్చారు.

కంగనకు అర్థమయ్యే ఉదాహరణను ప్రస్తావించటం ద్వారా ఆమె మాటల్లో దొర్లిన తప్పును హైలెట్ చేశారు. చివరగా.. ఎవరు ఎవరిపై ఆధారపడుతున్నారో ఇప్పుడు ఆలోచించు అంటూ ముక్తాయించారు. తనను తప్పు పట్టే వారిని ఒక పట్టాన వదిలిపెట్టని కంగనా.. డిప్యూటీ సీఎం కౌంటర్ కు ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News