గోవా రాష్ట్ర సర్కారు ప్రకటనలో సీఎంగా మనోహర్ పారీకర్

Update: 2019-09-06 06:41 GMT
గోవా అన్నంతనే గుర్తుకు వచ్చేది గోవాలోని అందమైన బీచ్ లు. కానీ.. ఇదంతా మనోహర్ పారీకర్ కు ముందు. ఎప్పుడైతే ఆయన ప్రతిభ.. నిజాయితీ.. సింపుల్ సిటీ లాంటివి ప్రపంచానికి తెలియటం మొదలైందో.. అప్పటి నుంచి గోవా అన్నంతనే బీచ్ లే కాదు.. మనోహర్ పారీకర్ సైతం గుర్తుకు రావటం మొదలైంది. అత్యున్నత స్థానంలో ఉన్నప్పటికీ సామాన్యుడిలా వ్యవహరించే తీరుతో తక్కువ కాలంలోనే యావత్ దేశంలోనే ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చేలా చేసింది.

రాష్ట్రాలకు అతీతంగా ఆయన మీద ప్రేమాభిమానులు ప్రదర్శించే వారు కోట్లాది మంది ఉన్నారు. అలాంటి మనోహర్ పారీకర్ అనూహ్యంగా అనారోగ్యానికి గురై మరణించటం తెలిసింది. ఆయన మరణం తర్వాత గోవా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు ప్రమోద్ సావంత్. అయినప్పటికీ ఆయనకు అంత గుర్తింపు రాలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా నిర్వహించిన గురుపూజోత్సవం సందర్భంగా గోవాలోని ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలుపుతూ గోవా ప్రభుత్వ పౌర సంబంధాల శాఖ ఒక ప్రకటనను విడుదల చేసింది.

అందులో గోవా ముఖ్యమంత్రిగా మనోహర్ పారీకర్ పేరును పెట్టిన వైనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పారీకర్ మరణం తర్వాత కూడా గోవా ముఖ్యమంత్రిగా ప్రమోద్ బాధ్యతలు చేపట్టి చాలా రోజులే అయినా.. ఆయన పేరు స్థానే మనోహర్ పారీకర్ పేరుతో ప్రటకన విడుదల చేయటంపై పలువురు విస్మయానికి గురి అవుతున్నారు.

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారీకర్ 56వ గురుపూజోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారని.. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ సేవల్ని కొనియాడినట్లుగా పేర్కొన్నారు. ఈ తప్పుపై విచారణకు ఆదేశించామని.. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని సమాచార శాఖామంత్రి స్పష్టం చేశారు. గోవా అధికారుల తీరు చూస్తుంటే.. ఇప్పటికి మనోహర్ పారీకర్ ఆలోచనల నుంచి ఇంకా బయటపడినట్లుగా లేరన్న భావన కలగటం ఖాయం.


Tags:    

Similar News