భ‌లే పాయింట్ తెర మీద‌కు తెచ్చిన మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి

Update: 2019-04-16 05:01 GMT
ప్ర‌ముఖ మీడియా సంస్థ‌లు క‌వ‌ర్ చేయ‌టం లేదు కానీ.. తెలంగాణ‌కు చెందిన కొన్ని చిన్న మీడియా సంస్థ‌ల‌కు చెందిన దిన‌ప‌త్రిక‌ల్లో వ‌స్తున్న సంచ‌ల‌న క‌థ‌నాలు రాజ‌కీయ క‌ద‌లిక‌కుకార‌ణం కావ‌ట‌మే కాదు.. కాంగ్రెస్ నేత‌లు మీడియా ముందుకు వ‌చ్చేలా చేస్తున్నాయి. ఈ నెల 11న ముగిసిన ఎన్నిక‌ల పోలింగ్ కు సంబంధించి తెర మీద‌కు వ‌చ్చిన పోలింగ్ శాతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లోక్ స‌భ ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌శాంతంగా ముగిసింది. షెడ్యూల్ ప్ర‌కార‌మే పోలింగ్ ముగిసింది. చాలా కొద్దిచోట్ల మాత్ర‌మే ఐదు గంట‌ల త‌ర్వాత కాసేపు కొన‌సాగింది. ఉదయం నుంచి పోలింగ్ స్టేష‌న్లు ఖాళీగా క‌నిపించ‌టం ఒక ఎత్తు అయితే.. రాత్రివేళ‌లో ఎన్నిక‌ల సంఘం అధికారులు పంపిన పోలింగ్ శాతం.. ప‌క్క‌రోజు సాయంత్రానికి మూడు నుంచి ఆరు శాతం వ‌ర‌కూ పెర‌గ‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

పొద్దున నుంచి ఈగ‌లు తోలుకుంటున్న చందంగా ఖాళీగా ఉన్న పోలింగ్ కేంద్రాల‌కు.. సాయంత్రం.. అందునా పోలింగ్ ముగిసే చివ‌రి గంట‌లో హ‌డావుడిగా పోలింగ్ భారీగా సాగ‌టం సాధ్య‌మ‌వుతుందా? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. ఇదే అంశాన్ని మ‌రింత లోతుల్లోకి వెళ్లిన కొన్ని మీడియా సంస్థ‌లు సంచ‌ల‌న క‌థ‌నాల్ని అచ్చేశాయి. అయితే.. ఇవేమీ ప్ర‌ధాన మీడియాకు చెందిన పేప‌ర్ల‌లో ప‌బ్లిష్ కాలేదు.

ఇదిలా ఉండ‌గా.. మీడియాలో వ‌చ్చిన క‌థ‌నాలో.. లేక అధికారులు ఇచ్చిన గ‌ణాంకాలను నిశితంగా ప‌రిశీలిస్తే వ‌చ్చిన సందేహాలో కానీ.. తాజాగా సీనియ‌ర్ కాంగ్రెస్ నేత మ‌ర్రిశ‌శిధ‌ర్ రెడ్డి కొత్త సందేహాల్ని తెర మీద‌కు తెచ్చారు. పోలింగ్ శాతాల్ని స‌మీక్షించిన ఆయ‌న‌.. చివ‌రి గంట‌లో స‌గ‌టున 5 శాతం చొప్పున పోలింగ్ ఎలా పెరుగుతుంద‌న్న ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేశారు. దీనిపై లోతుగా విశ్లేషించిన త‌ర్వాత ఎన్నిక‌ల క‌మిష‌న్ ను పోలింగ్ కేంద్రాల వారీగా స‌మాచారాన్ని అడుగుతామ‌ని ఆయ‌న చెబుతున్నారు.

ఏప్రిల్ 11 సాయంత్రం 5 గంట‌ల త‌ర్వాత నుంచి పోలింగ్ స్టేష‌న్ల‌లో వేచి ఉన్న ఓట‌ర్ల వివ‌రాలు.. నాటి వీడియో క్లిప్పింగ్ ల‌ను కూడా కోర‌నున్న‌ట్లుగా చెప్పారు. ప్రిసైడింగ్ అధికారులు నివేదించిన 17సి వివ‌రాలు.. ఎన్నిక‌ల సంఘం ఇచ్చిన స‌మాచారం ఒక‌టిగా ఉండాల‌ని.. లేకుంటే పోలింగ్ కేంద్రాల వారీగా ప‌రిశీలిస్తామ‌ని ఆయ‌న చెప్పారు. ఈ విష‌యం మీద మ‌రింత లోతుగా వెళితే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ చెబుతున్నాయి. మ‌రి.. మ‌ర్రి దీని మీద దృష్టి సారిస్తారా?
Tags:    

Similar News