మేయర్ హత్యలో ఇంటిదొంగల సహకారం

Update: 2015-11-19 04:35 GMT
సంచలనం సృష్టించిన చిత్తూరు మేయర్ అనురాధ.. ఆమె భర్త హత్యలకు సంబంధించి కొత్త విషయాలు బయటకు వచ్చాయి. మేయర్ ను చంపేందుకు బుర్ఖాలో వచ్చిన వారికి.. మేయర్ ఛాంబర్ ను చూపించటంతోపాటు.. హత్య చేసిన వెంటనే.. కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాన్ని మూసివేస్తే.. అక్కడి వారు కొందరు.. దుండగులకు ప్రహరీ గోడ దారి చూపించినట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. తమకు సాయం చేసిన వారికి దుండగులు థ్యాంక్స్ చెప్పటం జరిగిందన్న మాట వినిపిస్తోంది.

మేయర్ హత్య చేసేందుకు వచ్చిన దుండగులు బుర్ఖా ధరించి రావటం తెలిసిందే. అనుమానాస్పద రీతిలో బుర్ఖా వేసుకొచ్చిన వారిని మేయర్ అనుచరులు అడ్డుకున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే.. బుర్ఖా వేసుకొచ్చిన వారు ధరించిన బూట్లు.. చెప్పులు మగవారివిగా ఉండటంతో వెంటనే సందేహం వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారని.. అదే సమయంలో.. మేయర్ ఉన్న ఛాంబర్ కు దారి చూపించటంతో వారు వెళ్లినట్లుగా చెబుతున్నారు. ఇదంతా జరగటానికి ఇంటి దొంగల పాత్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దుండగులకు దారి చూపించిన వారు మేయర్ కు బాగా తెలిసిన వారు కావటం ఇప్పుడు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు.. హత్య చేసిన తర్వాత పారిపోయేందుకు ప్రయత్నించిన వారికి.. ప్రహరీగోడ దూకి వెళ్లటానికి వీలుగా.. దారి చూపించిన వారు కూడా కార్యాలయం గురించి బాగా తెలిసినవారేనని చెబుతున్నారు.

హత్య జరిగిన వెంటనే.. కార్పొరేషన్ మొయిన్ డోర్ ని క్లోజ్ చేశారు. అయితే.. ప్రజారోగ్య విభాగం పక్కనున్న ప్రహరీ గోడ దూకి వెళ్లిపోవచ్చన్న సలహా ఇచ్చిన నేపథ్యంలోనే దుండగులు అలా పారిపోయి ఉంటారని చెబుతున్నారు. మేయర్.. ఆమె భర్త హత్యలో అనుచర వర్గంలో కొందరు కోవర్టులుగా వ్యవహరించి ఉంటారన్న సందేహం కొత్త కలకలాన్ని రేపుతోంది. ఈ వ్యవహారంపై పోలీసులు మాత్రం ఇప్పటివరకూ అధికారికంగా ఏమీ చెప్పకపోవటం గమనార్హం.
Tags:    

Similar News