చివరకు.. మెట్రో రైలు టిక్కెట్లు బ్లాక్ లోనే

Update: 2015-12-06 05:07 GMT
మానవత్వంతో వ్యవహరించాల్సిన వేళ.. దాన్ని మర్చిపోయి.. ఎదుటోడి కష్టాన్ని కాసులుగా మార్చుకునే ధోరణి చెన్నైలో ఇప్పుడు చాలా ఎక్కువగా కనిపిస్తోంది. లక్షలాది మంది వరద కారణంగా తీవ్రఇక్కట్లు పాలైన నేపథ్యంలో.. ఎవరికి వారు అందినకాడికి దోచుకునే వైఖరికి తెర తీస్తున్నారు. ప్రతి దానికి డబ్బుతో ముడికడుతున్న ధోరణి ఇప్పుడు ప్రతిచోటా కనిపిస్తోంది.

ఆహారం కోసం.. నిత్యవసర వస్తువుల కోసం.. సాయం కోసం.. ఇలా ప్రతి దానికి చాంతాడంత క్యూలతో కాలం గడపాల్సి రావటంతో చెన్నై ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురి అవుతున్నారు. ఇలాంటి సమయాల్లోనే షార్ట్ కట్స్ మొదలవుతాయి. ప్రజల ఇబ్బందుల్ని చూసి.. వాటిని డబ్బుతో అధిగమించొచ్చన్న షార్ట్ కట్ ను కొందరు దళారులు ప్రోత్సహించటంతో డబ్బులున్నోడిదే రాజ్యంగా మారింది.

చెన్నైలో ప్రతిచోటా బ్లాక్ దందా నడుస్తోంది. చివరకు ఇది ఎక్కడి వరకూ వెళ్లిందంటే.. మెట్రో రైలు టిక్కెట్టు కూడా ఇప్పుడు బ్లాక్ లోకి వచ్చేశాయి. బారెడు క్యూలో నిలుచునే కన్నా.. నాలుగు రూపాయిలు పడేస్తే పోలా అనే వాళ్లు ఉన్నట్లే.. ఆ నాలుగు రూపాయిలు లేక విలవిలలాడిపోతున్న వారూ పెరిగిపోతున్నారు. చెన్నైలోని మెట్రో రైల్ టిక్కెట్లను కొందరు దళారులు బ్లాక్ లో అమ్మటం మొదలు పెట్టారు. రూ.40 మెట్రో టిక్కెట్టును రూ.100 నుంచి రూ.150 వరకూ అమ్ముతున్నారు. ఈ దోపిడీని చూసిన చెన్నై ప్రజానీకం ముక్కున వేలేసుకుంటోంది.
Tags:    

Similar News