దారుణం : మంత్రి కాన్వాయ్ ఢీకొని తాపీ మేస్త్రీ దుర్మరణం..!

Update: 2021-11-11 05:30 GMT
ఏపీ టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ కాన్వాయ్ లోని ఓ వెహికల్ ఢీ కొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించారు. ఈ విషాదకర ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. దీనితో తమకు న్యాయం చేయాలంటూ మృతుడి కుటుంబసభ్యులు సీతమ్మదారలోని మంత్రి ఇంటిముందు ఆందోళనకు దిగారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే... మంత్రి అవంతి శ్రీనివాస్ కాన్వాయ్ ఎయిర్ పోర్టు నుండి వస్తోంది. ఈ క్రమంలో ఈ కాన్వాయ్ లోని కారు బిర్లా కూడలి వద్ద ఓ బైక్ ను ఢీకొట్టింది.

దీంతో బైక్ పై వెళుతున్న తాపీ మేస్త్రీ సూర్యనారాయణ అక్కడికక్కడే మృతిచెందాడు. వేగంగా వెళుతున్న మంత్రి అవంతి శ్రీనివాస్ కాన్వాయ్ లోని కారు ఢీకొట్టడంతో సూర్యనారాయణ ఎగిరి రోడ్డు మీద పడ్డాడు. అయితే వెనకనుండి వచ్చిన మరోవాహనం అతడిపైనుండి వెళ్లడంతో ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. తాపీ మేస్త్రీగా పనిచేసే సూర్యనారాయణ మృతితో ఆ కుటుంబం పెద్దదిక్కును కోల్పోయింది. కాబట్టి బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

దీంతో అవంతి ఇంటి ముందు మృతుడి కుటుంబ స‌భ్యులు, బంధువులు నిరసనకు దిగారు. అవంతి వాహనం ఢీకొట్ట‌డం వ‌ల్లే సూర్యనారాయణ మృతి చెందాడని చెప్పారు.

ప్రభుత్వం తరఫున త‌మ‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ప్ర‌స్తుతం మంత్రి అవంతి ఇంటి ముందు పోలీసులు భారీగా మోహరించారు. మరోపక్క, ఇదే విషయంపై అవంతి శ్రీనివాస్ ఇంటి సమీపంలో జనసేన నేతలు కూడా ఆందోళనకు దిగారు. జనసేన నేతలు సందీప్, ఉషారాణిని మంత్రి ఇంటికి వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్ల వద్దే జనసేన కార్యక‌ర్త‌ల‌ను పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులతో వారు వాగ్వివాదానికి దిగారు.

దీంతో అవంతి శ్రీ‌నివాస్ మృతుడి బంధువుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. ఆ ఘోర‌ ప్ర‌మాదం జ‌రిగిన‌ స‌మ‌యంలో వాహ‌నంలో తాను లేనని ఆయ‌న చెప్పారు. మృతుడి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామ‌ని హామీ ఇచ్చారు. ప్ర‌మాద ఘ‌ట‌న‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నార‌ని ఆయ‌న చెప్పారు. తాము మాన‌వ‌తా దృక్ప‌థంతోనే ఆర్థిక సాయం అందిస్తామ‌ని చెబుతున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, విచారణలో పూర్తయితే అన్ని విషయాలను వారే వెల్లడిస్తారని మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు.
Tags:    

Similar News