ఇది విన్నారా? మంత్రి గుడివాడతో పవన్ ఫోటో తీసుకున్నారట

Update: 2022-04-26 05:40 GMT
మన గురించి ఎవరూ మాట్లాడనప్పుడు మన గురించి మనం మాట్లాడుకోవటం తప్పేం కాదు. అయితే.. దానికో అర్థం పర్థం ఉండాలి. అంతేకానీ.. నోటికి వచ్చినట్లుగా మాటలు చెప్పేస్తే మొదటికేమోసం వస్తుంది. జగన్ 2.0లో మంత్రిగా అవకాశాన్ని సొంతం చేసుకున్న గుడివాడ అమర్ నాథ్ వారి ఉత్సాహం మామూలుగా లేదు. నోటికి వచ్చినట్లుగా మాట్లాడేయటం.. జనసేన అధినేత పవన్ ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగానే కాదు.. కామెడీగా మారిపోయాయి. తన స్థాయిని తానే తగ్గించుకునేలా మంత్రి గుడివాడ వారి మాటలు ఉన్నాయంటున్నారు.

తాజాగా మీడియాతో మాట్లాడిన సందర్భంలో జనసేన అధినేత పవన్ ప్రస్తావన తెచ్చిన గుడివాడ.. షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఓవైపు మీడియాతో మాట్లాడుతున్న వేళ.. ఆయన చెప్పే మాటలకు కడుపుబ్బా నవ్వుకునే పరిస్థితి. అతి కష్టం మీద ఆయన మాటల్ని వింటూ నవ్వును తమాయించుకోవాల్సిన పరిస్థితిని మంత్రి గుడివాడ తీసుకొచ్చారని చెప్పాలి.

ఎందుకిలా అంటే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఉన్న ఛరిష్మా ఏమిటి? మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అందరికి తెలిసిన గుడివాడ అమర్ నాథ్ ఎక్కడ? అలాంటి ఆయనతో అప్పుడెప్పుడో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫోటో తీసుకుంటానని అడిగి తీసుకున్నట్లు చెబుతున్నారు మంత్రివర్యులు. ఈ కామెడీ మాటల్ని ఆయన నోటి నుంచి చెబితే మరింత ఎఫెక్టివ్ గా ఉంటుంది.ఇంతకీ పవన్ తో గుడివాడ వారి ఫోటో ప్రస్తావన రావటానికి కారణం మీడియానే.

ఒక పాత్రికేయుడు మాట్లాడుతూ.. పవన్ తో కలిసి అమర్ నాథ్ తీసుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది కదా? అని ప్రశ్నించినప్పుడు అందుకు బదులిచ్చిన అమర్ నాథ్.. ‘ఆ ఫోటో ఎప్పుడు తీయించుకున్నారో గుర్తు లేదు. జగన్ కారణంగా నాకు వచ్చిన ఇమేజ్ తో నాతో చాలామంది ఫోటోలు తీసుకుంటున్నారు. పవన్ కల్యాణే నాతో ఫోటో తీసుకున్నారు. కావాలంటే ఫోటోను చూడండి. అందులో పవన్ చేతులు కట్టుకొని ఉన్నారు. నాలాంటివాడితో ఫోటో తీయించుకునేటప్పుడు వినయం ప్రదర్శించాలని.. అందుకే పవన్ చేతులు కట్టుకున్నారు’’ అంటూ వ్యాఖ్యానించారు.

పవన్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరు.. పవన్ ఎవరితోనైనా ఫోటోలు దిగేటప్పుడు ఆయన తన రెండు చేతులు కట్టుకోవటం తెలిసిందే. గుడివాడ విషయంలోనూ అదే జరిగి ఉంటుంది. ఆ విషయాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న మంత్రిగారి మాటలు మహా కామెడీగా మారాయి. సొంత డబ్బా కొట్టుకునేటప్పుడు కాస్తంత జాగ్రత్తగా ఉండాలన్న ప్రాథమిక విషయం కూడా మంత్రిగారికి తెలీకపోవటం ఏమిటో?
Tags:    

Similar News