షాక్‌: బాబు హ‌యాంలో ఇలా కూడా జ‌రుగుతుందా!

Update: 2017-10-14 04:39 GMT
అది ఘ‌న‌త వ‌హించిన ఏపీ మంత్రివ‌ర్యుల ఘ‌న‌మైన ప్ర‌భుత్వ‌ కార్య‌క్ర‌మం. మంత్రి వ‌ర్యులు అట్ట‌హాసంగా ఫుల్ సెక్యూరిటీ మ‌ధ్య కారు దిగారు. రెడ్ కార్పెట్‌ పై ద‌ర్జాగా న‌డుస్తూ.. ముందుకు సాగారు. వెన‌క మందీ మార్బ‌లం జ‌య జ‌య ధ్వానాలు ప‌లుకుతున్నారు. గ‌జ‌మాల‌కు కొంచెం త‌క్కువ రేంజ్‌ లోఉన్న పూల దండ‌ను అక్క‌డి వారు మంత్రి వ‌ర్యుల మెడ‌లో అలంక‌రించారు. పూల తోర‌ణాలు - మంగ‌ళ హార‌తుల కార్య‌క్ర‌మం పూర్త‌యింది. మంత్రిగారు మ‌రో నాలుగ‌డుగేలు వేసి.. వ‌చ్చిన కార్య‌క్ర‌మం పూర్తి చేశారు. రిబ్బ‌న్ క‌ట్ చేసి ప్ర‌భుత్వం ఎట్ట‌కేల‌కు ఎన్నో విన‌తులు స్వీక‌రించాక నిర్మించిన భ‌వ‌నాన్ని ప్రారంభించారు. ఈ మొత్తం కార్య‌క్ర‌మానికి దాదాపు ఓ ప‌ది నుంచి 15 వేల రూపాయ‌లు ఖ‌ర్చ‌యింది. అయితే సాధార‌ణంగా ఈ సొమ్మంతా ప్ర‌భుత్వ‌మే ఖ‌ర్చు చేసింద‌ని.. ప్ర‌భుత్వ పెద్ద‌లే కార్య‌క్ర‌మం నిర్వ‌హించార‌ని అంద‌రూ అనుకున్నారు.

అయితే, ఇక్క‌డే అస‌లైన ట్విస్ట్‌! అది ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మమే అయినా.. వ‌చ్చింది మంత్రి వ‌ర్యులే అయినా.. ప్రోగ్రాంను పెద్ద‌లే ఏర్పాటు చేసినా.. ఖ‌ర్చు చేసింది మాత్రం చిన్నోళ్లు! అది కూడా మ‌హిళ‌లు!! ఈ వింత ఇప్పుడు చంద్ర‌బాబు పాల‌న‌లోనే అది కూడా రాజ‌ధాని జిల్లా గుంటూరులోనే చోటు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఆ కార్య‌క్ర‌మం వివ‌రాలు.. క‌ధాక‌మామీషు తెలుసుకుందాం ప‌దండి. గుంటూరు జిల్లా రేపల్లెలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల నూత‌న భ‌వ‌నానికి శుక్ర‌వారం ప్రారంభోత్సవం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ఆ శాఖ మంత్రి నక్కా ఆనంద్‌ బాబు  హాజ‌ర‌య్యారు. ఆయ‌న చేతుల మీదుగానే ఈ భ‌వ‌నం ప్రారంభం జ‌రిగింది.

మంగ‌ళ వాయిద్యాల శ‌బ్దాలు - పూల తోర‌ణాల ముచ్చ‌ట్ల‌న‌డుమ ఈ కార్య‌క్ర‌మాన్ని అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించారు. అయితే కార్యక్రమం ఏర్పాట్లకు సంబంధించి అయిన ఖర్చును మాత్రం ప్ర‌భుత్వం ఒక్క పైసా కూడా భ‌రించ‌లేదు. పోనీ ఎవ‌రైనా డోనార్లు ఇచ్చారా? అంటే అదీలేదు. ఈ మొత్తాన్ని ఆ పాఠ‌శాల‌లో విద్యార్థులకు చ‌దువులు చెప్పే మ‌హిళా టీచ‌ర్ల నుంచి వ‌సూలు చేశారు. అది కూడా  మంత్రి గారి గన్‌ మెన్లు - టీచర్ల నుంచి వసూలు చేయ‌డం గ‌మ‌నార్హం మొత్తంగా ఈ పాఠ‌శాల టీచర్ల నుంచి సుమారు 10 వేల రూపాయలు గన్‌ మెన్లు వసూలు చేశారు. ఈ మొత్తం వ‌సూళ్ల తతంగాన్ని ఈ కార్య‌క్ర‌మం క‌వ‌రేజ్ కోసం వెళ్లిన మీడియా ఫొటో గ్రాఫ‌ర్లు త‌మ కెమెరాల్లో బంధించారు. మ‌రోప‌క్క‌.. బాబు హ‌యాంలో ఇలా కూడా జ‌రుగుతుందా! అని ఆ పంతుల‌మ్మ‌లు నోరు నొక్కుకున్నారు!! ఇదీ సంగ‌తి!! మంత్రి వ‌ర్యా ఇలా త‌గునా?!
Tags:    

Similar News