జ‌వ‌హ‌ర్ మాట‌: ఉద్య‌మాలు పెయిడ్ అట‌!

Update: 2017-09-24 10:54 GMT
ఓ రెండు నెల‌ల కింద‌ట `బీరు హెల్త్ డ్రింక్‌` అంటే మాట తూలిన ఏపీ ఎక్పైజ్‌ మంత్రి జ‌వ‌హ‌ర్‌కి అన్ని ప‌క్షాల నుంచి పెద్ద ఎత్తున సెగ త‌గిలిన విష‌యం తెలిసిందే. హెల్త్ డ్రింక్ అయితే మెడిక‌ల్ స్టోర్స్ పెట్టి అమ్మండంటూ.. నెటిజ‌న్లు హాట్ హాట్ కామెంట్ల‌తో విరుచుకుప‌డ్డారు. దీనికి అప్ప‌ట్లో మంత్రిగారు రియాక్ట్ కాలేదు. దీనికితోడు టీడీపీ త‌మ్ముళ్లు ఎవ‌రూ స్పందించ‌లేదు. దీంతో అప్ప‌ట్లో ఆ వివాదం నెమ్మ‌దిగా స‌ర్దుమ‌ణిగింది. అయితే, తాజాగా మ‌రోసారి కూడా ఈ మంత్రిగారు మాట తూలారు! ఆ సారి ఏకంగాఆయ‌న రాష్ట్రంలోని మ‌హిళ‌ల‌నే టార్గెట్ చేశారు.

నిన్న మీడియాతో మాట్లాడిన జ‌వ‌హ‌ర్‌.. ఇటీవ‌ల రాష్ట్రంలో జ‌నావాసాల మ‌ధ్య మ‌ద్యం దుకాణాల‌పై ఉవ్వెత్తున జ‌రిగిన ఉద్య‌మాల ప్ర‌స్తావ‌న తెచ్చారు. మ‌హిళ‌లు స్వ‌చ్ఛందా ఇళ్ల‌లో ప‌నులు కూడా మానుకుని, ఉపాధి ప‌నుల‌కు డుమ్మా కొట్టి మ‌రీ.. ఈ షాపుల ఏర్పాటుపై ఉద్య‌మించిన విష‌యం తెలిసిందే. కొన్ని చోట్ల అయితే, పోలీసుల నుంచి లాఠీ దెబ్బ‌లు తిని కూడా ఇళ్ల మ‌ధ్య మ‌ద్యం షాపుల‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేశారు. అయితే, ఈ విష‌యాన్ని అత్యంత లైట్‌గా తీసుకున్న మంత్రి జ‌వ‌హ‌ర్‌.. ప‌నిలేనోళ్లు.. డ‌బ్బుల‌కు అమ్ముడు పోయినోళ్లు.. ఈ ఉద్య‌మాలు చేప‌ట్టార‌ని కించ‌ప‌రిచేలా మాట్లాడారు.  

 మద్యాన్ని ఆదాయ వనరుగా చూడట్లేదని, ఆరోగ్యాంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా తమ ప్రభుత్వం నూతన పాలసీని ప్రవేశ పెట్టిందని చెప్పారు. రాష్ట్రంలో ప్రజల విజ్ఞప్తి మేరకు 600 దుకాణాలను తరలించామన్నారు. మద్యం దుకాణాలు వద్దని చేసే ఉద్యమాల్లో సగం డబ్బులిచ్చి(పెయిడ్‌ ఈవెంట్స్‌) చేయిస్తున్నవేనని చెప్పారు. ప‌నులు లేని వారు ఆ డ‌బ్బుల‌కు ఆశ‌ప‌డి ఉద్య‌మాల్లో జెండాలు ప‌ట్టుకున్నార‌ని తీవ్ర‌స్థాయిలో కించ‌ప‌రిచారు.  మొత్తానికి ఈ వ్యాఖ్య‌ల‌పై మ‌హిళ‌లు మండిప‌డుతున్నారు. ఒక బాధ్య‌తా యుత‌మైన స్థాయిలో, స్థానంలో ఉన్న మంత్రి ఇలా మాట్లాడ‌డంపై  మండిప‌డుతున్నారు.
Tags:    

Similar News