మేడమ్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి ..!

Update: 2019-12-03 13:04 GMT
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ను ఉద్దేశించి జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌ పర్సన్ రేఖా శర్మ చేసిన వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. కీలక స్థానాల్లో ఉన్నవారు తమకొచ్చిన సమాచారాన్ని పరిశీలించుకొని - వాస్తవాలను తెలుసుకొని మాట్లాడాలని  చెప్పారు. సీఎం కేసీఆర్ మహిళలను కించపరిచే విధంగా ఎక్కడా మాట్లాడలేదు అని స్పష్టం చేశారు.

'మేడమ్.. ఒక ఉన్నత స్థాయిలో ఉన్న మీరు, ఏదైనా మాట్లాడేముందు అసలు విషయాలను తెలుసుకోండి. కేసీఆర్ గారు ఎప్పుడూ అలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వలేదు. కొన్ని మీడియా సంస్థలు, వాటి టీఆర్పీ రేటింగ్‌ను పెంచుకోవడం కోసం ఇలాంటి అబద్ధపు ప్రచారాలను చేస్తున్నాయి’ అని కేటీఆర్ ట్వీట్ చేసారు.

అసలేం జరిగింది? అంటే .. ఆదివారం  ఆర్టీసీ కార్మికులతో సమావేశం సందర్భంగా ఉద్యోగులపై సీఎం కేసీఆర్ వరాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళా ఉద్యోగులకు 8 గంటల లోపే విధులు ముగించుకునేలా డ్యూటీ చార్ట్‌ లు ప్రిపేర్ చేయాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. 50 వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల్లో మహిళా ఉద్యోగులు 5 వేల మంది కూడా లేరని..కాబట్టి ఇది అంత కష్టం కాకపోవచ్చు అని తెలిపారు. మహిళా కండక్టర్లు రాత్రి 11 గంటల దాకా విధుల్లో ఎందుకు? వారిని కాస్త తొందరగా ఇళ్లకు పంపించేద్దామని కేసీఆర్ ప్రకటించారు. దీనికి మహిళా ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు .

ఈ వ్యాఖ్యలపై అవాస్తవాలు ప్రచారం చేసిన నేపథ్యంలో ..మహిళా కమిషన్ ఛైర్‌ పర్సన్ 'మహిళలు - ఉద్యోగిణిలు రాత్రి 8 గంటల లోపే విధులు ముగించుకొని ఇళ్లకు చేరుకోవాలంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు షాక్‌ కు గురిచేశాయి. రాత్రి 8 గంటల్లోపు ఇంట్లో ఉండటానికి వాళ్లేమైనా జీవిత ఖైదీలా? ఇంట్లో ఉంటే మహిళలపై నేరాలు జరగవా?’ ‘సమాజంలో మహిళలకూ సమాన హక్కులు ఉన్నాయి. దీనిపై సీఎంకు కచ్చితంగా గుణపాఠం చెప్తాం’’  అంటూ ఆమె ట్వీట్‌ చేసింది. దీనిపై తాజాగా కేటీఆర్ కొంచెం ఘాటుగా స్పందించారు.


Tags:    

Similar News