‘మంగళవారం మరదలు’ అంటూ షర్మిలపై టీ మంత్రి వ్యాఖ్య

Update: 2021-10-28 13:30 GMT
రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే అన్న మాట ఉత్తినే అనరు. తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తే.. షర్మిలకు లేని ఇమేజ్ ను తెచ్చి పెట్టటమే కాదు.. ఆమెపై సానుభూతి వెల్లువలా వచ్చి పడేలా ఆయన వ్యవహరించిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ కుమార్తెగా ఇప్పటికే తన వాగ్ధాటి ఎంతన్న విషయాన్ని చెప్పిన షర్మిల.. తనలో పట్టుదల ఎంత ఎక్కువన్న మాటను అందరికి అర్థమయ్యేలా సుదీర్ఘ పాదయాత్రకు తెర తీయటం తెలిసిందే.

ఓపక్క పాదయాత్ర చేస్తూనే.. మరోవైపు ప్రతి మంగళవారం నిరుద్యోగుల ఉద్యోగాల భర్తీ కోసం నిరాహార దీక్ష చేయటం ఒక అలవాటుగా చేసుకున్న ఆమె.. క్రమం తప్పని కాలెండర్ ను ఫాలో అవుతున్నారు. నిత్యం తెలంగాణ రాష్ట్రప్రభుత్వం మీదా.. ముఖ్యమంత్రి కేసీఆర్ మీదా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నా.. మీడియాలో ఆమెకు దక్కుతున్న ప్రాధాన్యత అంతంతమాత్రమే. అంతేకాదు.. టీఆర్ఎస్ అధినాయకత్వం కూడా షర్మిల గురించి.. ఆమె చేస్తున్న విమర్శల గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు.

ఇలాంటివేళ.. మంత్రి నిరంజన్ రెడ్డికి ఏమైందో కానీ.. ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపేలా మారాయి. మహిళలకు ఇవ్వాల్సిన కనీస మర్యాదను వదిలేసిన ఆయన.. షర్మిలపై దూకుడుగా చేసిన వ్యాఖ్యలు ఆయనకు తిప్పలు తెచ్చి పెట్టేలా ఉన్నాయని చెబుతున్నారు. ఇంతకూ ఆయన ఏమన్నారంటే.. 'రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని దీక్షలు చేస్తానంటూ మంగళవారం మరదలు ఒకామె బయలుదేరింది' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మహిళల పట్ల మర్యాదగా వ్యవహరించని రాజకీయ నేతలు ఇప్పటికే రాజకీయంగా తగిన మూల్యం చెల్లించారు. షర్మిలను పట్టించుకోకుండా.. ఆమె ఉనికిని ప్రస్తావించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న తమ బాస్ కేసీఆర్ తీరుకు భిన్నంగా మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో రాజకీయ రగడ చోటు చేసుకోవటం ఖాయమంటున్నారు. ఇప్పటివరకు షర్మిల గురించి అటు పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ లేని వారు సైతం.. మంత్రి నోటి నుంచి వచ్చిన మంగళవారం మరదల మాట విషయంలో మంత్రి తీరును తప్పు పట్టటం ఖాయమంటున్నారు.

అంతేకాదు.. షర్మిల మాటకు కొత్త అర్థాన్ని బయటకు తీసిన మంత్రి నిరంజన్ రెడ్డి సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారని చెప్పాలి. ఉద్యోగాలు త్వరగా భర్తీ చేయాలనే షర్మిల డిమాండ్ వెనుక 20 శాతం కోటాలో తెలంగాణ ఉద్యోగాలను పొందేందుకు ఆంధ్రోళ్ల కుట్రలు దాగి ఉన్నాయని ఆయన మండిపడ్డారు. నిజంగానే 20 శాతం ఆంధ్రోళ్లకు ఉద్యోగాలు వస్తాయన్న ఉద్దేశంతో 80 శాతం తెలంగాణ వారిని దెబ్బ తీస్తారా? ఇదేనా తెలంగాణ అన్న ఆగ్రహానికి మంత్రివర్యులు ఏమని సమాధానం ఇస్తారు?
Tags:    

Similar News