రాజధానిలో భూకంపం.. నో ఫియర్

Update: 2015-07-27 09:39 GMT
    నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధానికి కేంద్రమైన గుంటూరు జిల్లాలో భూకంపం వచ్చింది... గుంటూరు జిల్లాలోని శావల్యాపురం, మతుకుమిల్లి, గొందులపాలెం తదితర ప్రాంతాల్లో రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. ఉన్నట్లుండి భూమి కంపించడంతో భయాందోళనలకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం ధాటికి జరిగిన నష్టం వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. భూకంప తీవ్రత స్వల్పంగానే ఉన్నందున నష్టమేమీ జరగలేదు.

నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి భూకంపాల జోన్-3లో ఉందని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ ట్రిపుల్ ఐటీకి చెందిన 'ఎర్త్ క్వేక్ ఇంజినీరింగ్ రీసర్చ్ సెంటర్'లోని నిపుణులు అమరావతి భూకంప ప్రాంతంలో ఉందని అంటున్నారు. కృష్ణా నది తీరంలోని విజయవాడ తీరప్రాంతాలన్నీ జోన్3 కిందకే వస్తాయని చెప్పారు. అయితే జోన్4, జోన్5, జోన్6 భూకంపాలతో పోలిస్తే జోన్ 3 తీవ్రత తక్కువగా ఉంటుంది కాబట్టి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నారు. నేపాల్ సరిహద్దు ప్రాంతాలు, కాశ్మీర్ జోన్5లో ఉన్నాయని చెప్పారు. టోక్యో, కాలిఫోర్నియా లాంటి నగరాలు జోన్5 కన్నా అత్యధిక తీవ్రత కలిగి ఉన్నాయని... అయితే, భూకంపాలను తట్టుకుని నిలబడే విధంగా అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు. అందువల్ల, రాజధాని అమరావతి నిర్మాణంలో అంతర్జాతీయ ప్రమాణాలను పాటించి, భూకంప తీవ్రతను తట్టుకునే విధంగా వాటిని తీర్చిదిద్దాలని సూచించారు.
Tags:    

Similar News