అలాంటి యాడ్స్ వేస్తే కష్టమే.. ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్

Update: 2022-06-11 11:30 GMT
టీవీల్లో ఇష్టానుసారంగా ప్రకటనలు వేసి సొమ్ముచేసుకుంటున్న కంపెనీలకు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) షాక్ ఇచ్చింది. మార్గదర్శకాల మేరకు తప్పుదారి పట్టించే ప్రకటనలపై ఇక నుంచి చర్యలు తీసుకోనున్నారు. సీసీపీఏ సరోగేట్ ప్రకటనలను కూడా నిషేధించింది. పారదర్శకత తీసుకురావడమే ఈ నిర్ణయం ఉద్దేశం అని ప్రభుత్వం పేర్కొంది.

వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలు తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొంది. ప్రకటనలలో ఇచ్చిన సమాచారం ఉత్పత్తిలో లేకుంటే.. ఆ ప్రకటనలు తప్పుదారి పట్టించే ప్రకటనలుగా పరిగణిస్తారు.

ఇది కాకుండా ఒక సెలబ్రెటీ ఒక ప్రకటనలో చెప్పినవి నిజం కాకపోయినా ఆ ప్రకటనలను కూడా ఇదే కేటగిరిలోకి చేరుస్తారు. ఇప్పటివరకూ 117 మందికి సీసీపీఏ నోటీసులు పంపింది. ఇందులో 57మందిని తప్పుదారి పట్టించే ప్రకటనలు, 47 మంది తప్పుడు వ్యాపార విధానాలు, 9మంది వినియోగదారుల హక్కులను అడ్డుకున్నందుకు నోటీసులు పంపారు.

టీవీల్లో ఏదైనా అల్కహాల్ , పొగాకు లేదా సారూప్య ఉత్పత్తికి సంబంధించిన ప్రకటనలు చూస్తేనే ఉంటాం. ఇందులో ఉత్పత్తిని నేరుగా వివరించకుండా మరొక ఉత్పత్తి లేదా పూర్తిగా భిన్నమైన ఉత్పత్తిగా చూపిస్తుంటారు. ఉదాహరణకు అల్కహాల్ ను తరుచుగా సోడాల రూపంలో చూపిస్తుంటారు. ఇలాంటివి కూడా ఇకపై చూపించొద్దు.

దేశంలో ప్రత్యక్ష ప్రకటనలు నిషేధంలో ఉన్నాయి. వీటిలో ఆల్కహాల్, సిగరెట్లు, పాన్ మసాలా వంటి ఉత్పత్తులు ఉంటాయి. ఇటువంటి పరిస్థితిలో ఈ ఉత్పత్తుల ప్రకటనల కోసం సర్రోగేట్  ప్రకటనలను ఉపయోగిస్తుంటారు.

ఏదైనా తప్పుదోవ పట్టించే ప్రకటనలు ప్రదర్శిస్తే తయారీదారులు, ప్రకటనదారులు, ఎండార్సర్ లపై రూ.10లక్షల వరకూ జరిమానా విధించవచ్చు. తదుపరి ఉల్లంఘనల కోసం దీనిని 3 సంవత్సరాల వరకూ పొడిగింవచ్చు. ఈ నియమాలు వినియోగదారులను తప్పుదారి పట్టించే ప్రకటనలపై ఫిర్యాదు చేయడానికి పూర్తి అధికారం కల్పిస్తాయి.
Tags:    

Similar News