స‌ద‌స్సులో మోడీ.. ఇవాంకల‌కు రోబో సేవ‌లు

Update: 2017-11-28 07:03 GMT
మిగిలిన రోజుల్ని ప‌క్క‌న పెడితే.. జాతీయ స్థాయిలో ఈ రోజు అంద‌రి దృష్టి హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రం మీద‌నే ఉంది.  ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన రెండు కార్య‌క్ర‌మాలు కాస్త తేడాతో ప్రారంభం కానున్నాయి. జీఈఎస్ స‌ద‌స్సు ఒక‌టైతే.. రెండోది మెట్రో రైల్‌. ఈ రెండు కార్య‌క్ర‌మాల్లో ఒక‌దానికి అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంక హాజ‌రు కావ‌టంతో అంద‌రి క‌న్ను ఆమె పైనే ఉంది.

ఇదిలా ఉంటే.. ఈ స‌ద‌స్సులో కొన్ని ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌లు అంద‌రిని సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కు గురి చేస్తాయంటున్నారు. ప్ర‌ధానిని ఉద్దేశించి న‌మ‌స్తే న‌రేంద్ర మోడీజీ అని.. ట్రంప్ కుమార్తెను.. న‌మ‌స్తే ఇవాంక అంటూ పిలిచే పిలుపుల‌కు వారు చిరున‌వ్వులు చిందించ‌టం ఖాయ‌మంటున్నారు. ఇంత‌కీ వారి చేత న‌వ్వులు కురిపించేలా ఎవ‌రు చేస్తున్నారంటే.. మిత్ర అనే రోబో. రోటీన్‌కు భిన్నంగా రోబో చేత జీఈఎస్ వేదిక మీద స్వాగ‌తం ప‌లికించ‌నున్నారు.

జీఈఎస్ స‌ద‌స్సుకు వేదిక అయిన హెచ్ ఐసీసీ ప్రాంగ‌ణానికి మోడీ.. ఇవాంక‌లు చేరుకున్న వెంట‌నే రోబో మిత్ర వారిని ప‌లుక‌రిస్తుంది.

ఈ రోబోను బెంగ‌ళూరుకు చెందిన బాలాజీ విశ్వ‌నాథ‌న్ రూపొందించారు. మ‌రింత ఆస‌క్తిక‌ర‌మైన ముచ్చ‌ట ఏమిటంటే.. ఈ రోబోను పూర్తిగా లోకల్ టెక్నాల‌జీతో రూపొందించ‌టం. ఆయ‌న బృందం రూపొందించిన రెండు రోబోల్లో ఒక‌టి వేదిక మీదకు వ‌చ్చిన అతిధుల్ని ప‌లుక‌రించ‌టం.. వారితో మాట్లాడ‌టం చేస్తే.. మ‌రో రోబో మాత్రం వేదిక బ‌య‌ట ఉండి ప్రేక్ష‌కుల‌తో మాట్లాడనుంది.

ఈ స‌ద‌స్సుకు వీవీఐపీలు రానుండ‌టంతో క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు. వేదిక మీద రోబో మిత్ర కాసేపు మాట్లాడ‌నుంది. అంతేకాదు.. మోడీ.. ఇవాంక‌లు వేదిక మీద‌కు వ‌చ్చిన‌ప్పుడు వారి వ‌ద్ద‌కు వెళ్లి.. వారితో మాట్లాడుతుంది. వారు కానీ ఒక  బ‌ట‌న్ ప్రెస్ చేస్తే పాట కూడా పాడ‌నుంది. అంతేకాదు.. స‌ద‌స్సు ప్రారంభమైంద‌న్న విష‌యాన్ని రోబోనే ప్ర‌క‌టించ‌నుంది. ఇలా భిన్నంగా చేప‌డుతున్న కార్య‌క్ర‌మం మోడీనే కాదు.. ఇవాంక‌ను కూడా ఆక‌ర్షించ‌టం ఖాయ‌మ‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News