గుంటూరులో జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ తర్వాత జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోన్న సంగతి తెలిసిందే. అప్పటివరకు తమ అధినేత చంద్రబాబు పగ్గాలు వేసి ఆపడంతో పవన్ పై విమర్శలు చేయని తెలుగు తమ్ముళ్లకు....ఆ సభ తర్వాత లైసెన్స్ దొరకడంతో విమర్శనాస్త్రాలు సంధించడం మొదలెట్టారు. తాజాగా, ఆ జాబితాలోకి టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ చేరారు. రాబోయే ఎన్నికల్లో జనసేనకు ఒక్క సీటు కూడా రాదని జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవికి కనీసం 16 సీట్లయినా వచ్చాయని, పవన్ కు ఒక్కటి కూడా రాదని జోస్యం చెప్పారు. పవన్ కు రాజకీయ స్థిరత్వం లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. విజయవాడలో విలేకరులతో బుధవారం మాట్లాడిన జలీల్ ఖాన్ అనేక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పవన్ కల్యాణ్ చాలా నీతిమంతమైన మాటలు మాట్లాడుతున్నారని, ఆయన గతంలో ప్రజారాజ్యంలో పని చేసిన సంగతి మరచిపోయారని అన్నారు. ఆ సమయంలో తమ సామాజిక వర్గానికి చెందిన వారికి చిరంజీవి, అల్లు అరవింద్ టికెట్లు ఇచ్చి డబ్బులు దండుకున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. బీజేపీకి దగ్గరయ్యేందుకే పవన్ తమపై వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీకి అనుకూలంగా పవన్ వ్యవహరిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీ, చంద్రబాబు, లోకేష్ ల పై పవన్ చేస్తోన్న ఆరోపణలను ప్రజలు నమ్మడం లేదని జలీల్ ఖాన్ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అహర్నిశలు పోరాడుతున్నది టీడీపీనేనని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తానని ప్రకటించారని - అయితే ఆ పార్టీ తరఫున ఎంపికైన రాజ్యసభ సభ్యులు కూడా రాజీనామా చేయాలని ఆయన అన్నారు.