ఖాకీవాలా కాదు కాబూలీవాలా

Update: 2015-11-13 10:50 GMT
కరీంనగర్ పోలీసుల వడ్డీ వ్యాపారంలో రోజుకో కొత్త కోణం వెలుగుచూస్తోంది. కోట్లలో అప్పులిస్తూ తీర్చలేనివారి ఆస్తులను బలవంతంగా రాయించుకుంటున్న వైనం ఇప్పటికే బయటపడగా... తాజాగా కొందరు ఎమ్మెల్యేలు కూడా పోలీసుల నుంచి అప్పులు తీసుకున్నట్లు తెలుస్తోంది. పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కూడా పోలీసుల నుంచి 4 కోట్లు అప్పు తీసుకున్నట్లు సమాచారం.

కరీంనగర్‌ లో ఏఎస్సైగా పనిచేస్తున్న మోహన్ రెడ్డి వడ్డీ వ్యాపారంలో ఆరితేరిపోయారన్న సంగతి ఇప్పటికే వెలుగుచూసింది.  కోట్లాది రూపాయల మేర అప్పులిస్తున్న ఆయన ఆయా రుణ గ్రహీతలకు చెందిన ఆస్తులను బలవంతంగా రాయించుకుంటూ, వేధింపులకు గురిచేస్తున్నాడట.  మోహన్ రెడ్డి వడ్డీ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టిన కరీంనగర్ జిల్లా అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డి పైనా ఇప్పటికే బదిలీ వేటు పడింది. తెలంగాణలో సంచలనం రేకెత్తిస్తున్న ఈ కేసులో సిఐడి పోలీసులు కొత్త కోణాలను వెలికితీస్తున్నారు. దీంతో మరికొందరి పేర్లు కూడా బయటపడే అవకాశం ఉంది. మోహన్ రెడ్డి వద్ద  ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఏకంగా రూ.4 కోట్ల మేర రుణం తీసుకున్నట్లు సమాచారం. కాగా పోలీసుల విచారణలో  ఏఎస్సై మోహనరెడ్డి చాలామంది పేర్లు వెల్లడిస్తున్నట్లు చెబుతున్నారు. ఇంకెంతమంది ఎమ్మెల్యేలు - ఎంపీల పేర్లు ఈ వ్యవహారంలో బయటపడతాయో చూడాలి.
Tags:    

Similar News