పాడైన రోడ్డుకు టోల్ ఎలా వ‌సూలు చేస్తారు?

Update: 2022-01-07 08:30 GMT
ఏపీ రాజ‌కీయాల్లో ఫైర్‌బ్రాండ్‌గా పేరున్న న‌గ‌రి ఎమ్మెల్యే రోజాకు ప్ర‌స్తుతం గ‌డ్డు ప‌రిస్థితులు న‌డుస్తున్నాయ‌నే చెప్పాలి. వ‌రుస‌గా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆమెకు త‌న నియోజ‌క‌వ‌ర్గంలో సొంత పార్టీ నేత‌ల నుంచే తీవ్ర వ్య‌తిరేక‌త వ‌స్తోంది. రోజా  అవ‌లంబిస్తున్న విధానాల ప‌ట్ల అక్క‌డి వైసీపీ నేత‌లు ఆగ్ర‌హంతో ఉన్న‌ట్లు తెలుస్తోంది. అందుకే రోజాకు పోటీగా ఓ వ‌ర్గం ప‌ని చేస్తుంద‌ని స‌మాచారం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా రోజాకు టికెట్ ద‌క్క‌కుండా ఉండేలా ఆ వ‌ర్గం పావులు క‌దుతుంద‌నే టాక్ వినిపిస్తోంది.

ఈ నేప‌థ్యంలో త‌న‌పై సొంత పార్టీ నేత‌ల్లోనే అసంతృప్తి ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌జ‌ల మ‌ద్ద‌తుతోనే దానికి చెక్ పెట్టేందుకు రోజా ముందుకు సాగుతుంద‌ని తెలిసింది. మీతో మీ ఎమ్మెల్యే కార్య‌క్ర‌మంతో ఆమె ప్ర‌జ‌ల్లోకి వెళ్తున్నారు. అయిన‌ప్ప‌టికీ ప‌రిస్థితుల్లో ఎలాంటి మార్పు రావ‌డం లేద‌ని స‌మాచారం. ఇటీవ‌ల జ‌గ‌న్ పుట్టిన రోజు వేడుక‌ల‌నూ రెండు వ‌ర్గాలుగా విడిపోయి పార్టీ శ్రేణులు చేసుకున్నాయి. ఇప్ప‌టికే జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మంత్రి ప‌ద‌వి ఆశించి రోజా భంగ‌ప‌డ్డారు. ఇప్పుడు రెండో విడ‌త‌లోనైనా ఆమెకు అవ‌కాశం ద‌క్కుతుందా అనుకుంటే.. ఇప్పుడు సొంత పార్టీ నేత‌ల నుంచే వ్య‌తిరేక‌త స‌మ‌స్య‌గా మారింది.

ఇక ఇలాగే ఉంటే లాభం లేద‌నుకున్న ఆమె తాజాగా పాడైన జాతీయ ర‌హ‌దారుల స‌మ‌స్య‌ను ముంద‌రేసుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఇటీవ‌ల వ‌ర్షాల‌కు పాడైన జాతీయ ర‌హ‌దారుల‌ను బాగు చేయించాల‌నే డిమాండ్‌ను అందుకున్నారు. చిత్తూరు జిల్లా న‌గ‌రి- పుత్తూరులోని జాతీయ ర‌హ‌దారి అధ్వానంగా ఉంద‌ని.. అలాంటి రోడ్డుకు టోల్ రుసుము వ‌సూలు చేయ‌డం స‌రికాద‌ని ఆమె పేర్కొన్నారు. అంతే కాకుండా టోల్ వ‌సూలు చేయ‌వ‌ద్ద‌ని ఆర్ అండ్ బీ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి కృష్ణ‌బాబుకు విన‌తి ప‌త్రం కూడా స‌మ‌ర్పించారు. ఇటీవ‌ల వ‌ర్షాల‌కు తిరుప‌తి- చెన్నై ర‌హ‌దారి పూర్తిగా దెబ్బ‌తింద‌ని దాన్ని వెంట‌నే బాగు చేయాల‌ని కోరారు. ఒక‌వేళ స్పందించ‌క‌పోతే ప్ర‌జ‌లు ధ‌ర్నాలు, రాస్తారోకోలు చేస్తారని కూడా హెచ్చరించారు. గ‌తంలోనూ తిరుప‌తి-తిరుత్త‌ణి-చెన్నై జాతీయ ర‌హ‌దారి 205పై గుంత‌లు ప‌డి అక్క‌డ‌క్క‌డా రోడ్డు లేచిపోయింద‌ని రోజా ఫిర్యాదు చేశారు. నేష‌న‌ల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా డీజీఎంకు లేఖ కూడా పంపారు.

దానిపై అప్పుడు స్పందించిన డీజీఎం జ‌న కుమ‌ర‌న్ రూ.17 ల‌క్ష‌లు విడుద‌ల చేసి ప‌నులు చేస్తున్న‌ట్లు స‌మాధానం కూడా ఇచ్చారు. అంత‌వ‌ర‌కూ బాగానే ఉంది కానీ రాష్ట్ర ప‌రిధిలో ఉండే ర‌హ‌దారుల మ‌ర‌మ్మతుపై కూడా ఎమ్మెల్యే స్పందించి.. జ‌గ‌న్ దృష్టికి తీసుకు వెళ్తే బాగుంటుంద‌ని ప్ర‌జ‌లు కోరుకుంటున్నారు. రాష్ట్రంలోని ర‌హ‌దారుల దుస్థితిపై ఇప్ప‌టికే జ‌న‌సేన పోరాటం చేస్తోంది. మరోవైపు ర‌హ‌దారుల మ‌ర‌మ్మ‌తు కోసం స‌మీక్ష నిర్వ‌హించిన జ‌గ‌న్ వెంట‌నే వాటిని బాగు చేయాల‌ని ఆదేశించారు. కానీ ఇప్ప‌టికీ ఆ ప‌నులు కార్య‌రూపం దాల్చ‌లేవ‌ని తెలిసింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో రాష్ట్ర ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోని రోడ్ల మ‌ర‌మ్మ‌తుల విష‌యం వ‌దిలేసి.. జాతీయ ర‌హ‌దారులు బాగు చేయాల‌ని రోజా కోర‌డం విడ్డూరంగా ఉంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. ఇలా ఏం చేసినా రోజాకు మాత్రం ప్ల‌స్ కావ‌డం లేద‌ని భావిస్తున్నారు.
Tags:    

Similar News