ఎమ్మెల్సీ ఎన్నికల ముచ్చట.. అసెంబ్లీ లాబీల్లో ఏం జరిగిందంటే..!

Update: 2023-03-15 09:42 GMT
పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చేందుకు మరో కొన్ని రోజులు పడుతుంది. దీంతో ఈ ఫలితాలపై రాష్ట్రంలో ఆసక్తికర చర్చ సాగుతోంది. ముఖ్యంగా అసెంబ్లీ లాబీల్లో నేతల మధ్య మరింత ఆసక్తిగా సాగుతోంది. పట్టభద్రుల స్థానాల్లో మెజారిటీ సాధిస్తామని టీడీపీ, పీడీఎఫ్ ప్రజా ప్రతినిధులు ఎవరి విశ్వాసం వారు వ్యక్తం చేశారు. “ఉత్తరాంధ్ర పట్టభద్ర స్థానంలో పీడీఎఫ్ అభ్యర్థిని రమా ప్రభ ఖాయంగా గెలుసారు. అక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు 30 వేల ఓట్లున్నాయి.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మేం గత ఏడాదిగా పోరాడుతున్నాం. ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు మాకు ఎలాగూ వస్తాయి. అందుకని అక్కడ గెలుస్తామని అనుకొంటున్నాం. అక్కడ వైసీపీ మూడో స్థానానికి పరిమితం అవుతుంది” అని పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఒకరు అన్నారు. రాయలసీమలోని రెండు పట్టభద్ర స్థానాల్లో ఒకదానిలో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌ విజయావకాశాలు ఉన్నట్లు అనిపిస్తోందని, రెండో దానిలో పీడీఎఫ్ అభ్యర్థి పోతుల నాగరాజు గెలుస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.

ఉపాధ్యాయ స్థానాలు రెండింటిలోనూ పీడీఎఫ్ అభ్యర్థులే గెలుస్తారని అన్నారు. అయితే, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రం ఉత్తరాంధ్ర స్థానంలో తమకే గెలుపు అవకాశం ఉందని చెబుతున్నారు. “ఉత్తరాంధ్రలో వైసీపీపై వ్యతిరేకత బలంగా ఉంది. టీడీపీ అభ్యర్థి చిరంజీవికి మంచి పేరుంది. ఎవరిని అడిగినా టీడీపీకి ఓటేశామని చెబుతున్నారు. అందుకే మేం నమ్మకంతో ఉన్నాం” అని ఆ ప్రాంత టీడీపీ ఎమ్మెల్యే ఒకరు చెప్పారు.

రాయలసీమలో రెండో పట్టభద్ర స్థానం ఫలితంపై టీడీపీ నేతల నుంచి భిన్నమైన విశ్లేషణలు వినిపిస్తున్నాయి. “ఆ స్థానం పరిధిలో పాత ఉమ్మడి జిల్లాలు మూడు ఉన్నాయి. వీటిలో అనంతపురంలో టీడీపీకి మెజారిటీ వస్తుంది. కడపలో వైసీపీకి మెజారిటీ వస్తుంది. కర్నూలు జిల్లాలో ఓటింగ్ ఎలా ఉందన్న దానిపై ఫలితం ఆధారపడి ఉంది.

మా నాయకుల అంచనా ప్రకారం అక్కడ వాతావరణం మాకు సానుకూలంగానే ఉందంటున్నారు. మేం డబ్బులు పంపిణీ చేయలేదు. వైసీపీ అభ్యర్థి పంచారు. అయితే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు టీడీపీ.. పీడీఎఫ్ మధ్య చీలిపోతే ఏం జరుగుతుందన్నది చూడాలి” అని రాయలసీమ టీడీపీ ప్రజా ప్రతినిధి ఒకరు చెప్పారు. మొత్తంగా నేతల మధ్య ఎమ్మెల్సీ ఎన్నికల టెన్షన్ అయితే కొనసాగుతోంది.

Similar News