కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి తాగి వ‌చ్చారు: ప‌ల్లా

Update: 2018-03-12 09:28 GMT
నేడు ప్రారంభమైన తెలంగాణ బడ్జెట్ సమావేశాలలో రసాభాస జ‌రిగింది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తుండగా కాంగ్రెస్ సభ్యులు గంద‌ర‌గోళం సృష్టించారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యత్నించడంతో తెలంగాణ అసెంబ్లీలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్ప‌డ్డాయి. ప్లకార్డులతో నిరసన తెలుపుతూ వారంతా వెల్ లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించ‌డంతోపాటు బడ్జెట్ ప్రసంగ ప్రతులను చించి వెల్ పైకి విసిరేశారు. ఆ త‌ర్వాత హ‌ఠాత్తుగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి.....వెల్ పైకి విసిరిన హెడ్‌ ఫోన్స్‌....శాస‌న మండలి చైర్మన్‌ స్వామిగౌడ్ కు తగిలాయి. దీంతో, స్వామిగౌడ్ కంటికి స్వల్ప గాయాలు కావ‌డంతో ఆయనను హుటాహుటిన సరోజినీదేవి కంటి ఆస్పత్రికి తరలించారు. స‌భ‌లో దురుసుగా ప్ర‌వ‌ర్తించ‌డమే కాకుండా స్వామిగౌడ్ ను గాయ‌ప‌రిచిన కోమ‌టిరెడ్డిపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. కోమ‌టిరెడ్డిపై ఒక సంవ‌త్స‌రం స‌స్పెన్ష‌న్ తో పాటు - క్రిమిన‌ల్ కేసు పెట్టేందుకు సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది.  

కోమ‌టిరెడ్డి తీరుపై ఇరిగేష‌న్ - అసెంబ్లీ వ్య‌వ‌హారాల మంత్రి హ‌రీశ్ రావు మండిప‌డ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరును ఆయ‌న ఖండించారు. అసెంబ్లీ స‌మావేశాల‌ను అడ్డుకొనేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప‌క్కా ప్ర‌ణాళిక‌తో వ‌చ్చార‌ని హ‌రీశ్ అన్నారు. కోమ‌టి రెడ్డి విసిరిన మైక్ ...గ‌వ‌ర్న‌ర్ గారికి త‌గిలి ఆయ‌న‌కు గాయాలై ఉంటే ప‌రిస్థితి ఏమిట‌ని హ‌రీశ్ అన్నారు. ఈ ఘ‌ట‌న‌పై నివేదిక స‌మ‌ర్పించాల్సిందిగా అధికారుల‌ను ఆదేశించాన‌ని - నివేదిక రాగానే కోమ‌టిరెడ్డిపై అసెంబ్లీ నియ‌మావ‌ళి ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని తెలిపారు.మ‌రోవైపు - టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల‌పై దాడి చేసేందుకే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మద్యం తాగి అసెంబ్లీ స‌మావేశాల‌కు వచ్చారని ప్రభుత్వ విప్ - ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. స‌భ‌లో కాంగ్రెస్ సభ్యుల ప్రవర్తన శాసన వ్యవస్థే తలదించుకునేలా ఉందన్నారు. మద్యం తాగి వ‌చ్చిన ఒక ఎమ్మెల్యే.....జానారెడ్డిపై తూలి పడబోవ‌డం తాము గ‌మ‌నించామ‌ని అన్నారు. సహచర సభ్యుల అల్లరి చూడలేక కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మధ్యలోనే లేచి వెళ్లిపోయారని పల్లా చెప్పారు. కాంగ్రెస్‌ సభ్యులను ఏడాది పాటు సస్పెండ్‌ చేయాలని రాజేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు.

ప‌ల్లా వ్యాఖ్య‌ల‌పై కోమ‌టిరెడ్డి మండిప‌డ్డారు. త‌న‌ను తాగుబోతు అని సంబోధించడానికి ఎంత ధైర్యం అని విరుచుకుప‌డ్డారు. అయినా, కేసీఆర్ వంటి తాగుబోతును ప‌క్క‌న‌బెట్టుకొని త‌న‌ను తాగుబోతు అన‌డం స‌రికాద‌ని ఎద్దేవా చేశారు. మ‌ద్యం తాగ‌నిదే కేసీఆర్ కు రోజు గ‌డ‌వ‌ద‌న్న విష‌యం తెలంగాణ‌లో ప్ర‌తి ఒక్క‌రికీ తెలుస‌ని షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో - కేసీఆర్ ఫాం హౌస్ లో మ‌ద్యం ఏరులై పారుతోంద‌ని మండిప‌డ్డారు. తాను మ‌ద్యం సేవించ‌లేద‌న‌డానికి ఏ ప‌రీక్ష‌కైనా సిద్ధ‌మ‌ని, కేసీఆర్ కూడా ఆ ప‌రీక్ష కు సిద్ధంగా ఉన్నారో లేదో చెప్పాల‌ని స‌వాల్ విసిరారు. స్వామిగౌడ్ అంటే త‌మ‌కు గౌర‌వం ఉంద‌ని - కానీ, ప్ర‌తిప‌క్షాన్ని అణ‌గ‌దొక్కేందుకు టీఆర్ ఎస్ కుయుక్తులు ప‌న్నుతోంద‌ని ఆరోపించారు. కేసీఆర్ స‌ర్కార్ నాట‌కాలాడుతోంద‌ని విమ‌ర్శించారు.
Tags:    

Similar News